గండికోట ఉత్సవాలను విజయవంతం చేద్దాం
కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ‘గండికోట ఉత్సవాల‘ను వైభవంగా నిర్వహించేలా ప్రత్యేక కార్య చరణ ప్రణాళికలు రూపొందించి విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం గండికోట ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో, ఈవెంట్ నిర్వహక ప్రతినిధులు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీటీడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గండికోట పర్యాటక ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టే అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించిన మ్యాపులను ఈవెంట్ మేనేజర్లు ప్రదర్శించగా.. జిల్లా కలెక్టర్ వాటిపై పలు సూచనలు, సలహాలను అందించారు. పనుల నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా.. రాయలసీమ వైభావాన్ని, గండికోట చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరించే అన్ని రకాల కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 11, 12, 13 తేదీల్లో జరగనున్న గండికోట పర్యాటక ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా పలు రకాల పోటీలు ఉంటా యని వెల్లడించారు. పర్యాటకులకు సంతృప్తి కరమైన అనుభూతిని అందించేలా కార్యక్రమాలను తీర్చిదిద్దాలని సంబందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ,డ్వామా,డిఆర్డీఏ, మెప్మా పిడీలు ఆది శేషా రెడ్డి, రాజ్యలక్ష్మీ, కిరణ్ కుమార్, డీపీపీ రాజ్యలక్ష్మి, రిమ్స్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, ఏపీ టిడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం,డీఈ పెంచలయ్య, ఎపిఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణ, జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్‌ఈ చంద్రశేఖర్, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు, జిల్లా ఫైర్ ఆఫీసర్ ధర్మారావు, ఇంటాక్ ప్రతినిధి చిన్నపరెడ్డి, విజ్ క్రాఫ్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ డీజీఎం నంద కుమార్ పాల్గొన్నారు.
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


