రైతుల సంక్షేమానికి కృషి చేయాలి
కడప అగ్రికల్చర్ : రైతుల సంక్షేమానికి మార్కెట్‌యార్డుల చైర్మన్‌లు, సెక్రటరీలు కలిసి కట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ విజయ సునీత సూచించారు. కడప మార్కెట్ యార్డులోని జేడీ కార్యాలయ సమావేశం మందిరంలో మంగళవారం రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, ఆనంతపురం ఉమ్మడి జిల్లాల మార్కెట్‌యార్డు చైర్మన్‌లకు మార్కెట్ యార్డు చట్టాలు, విధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయడమే అభివృద్ధి అన్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్‌లు కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా విలువల జోడింపుతోపాటు స్థూల ఆదాయం పెంచే పంటలనే రైతులు సాగు చేసుకునేలా సూచించాలన్నారు. రైతులు అభివృద్ధి చెందితే మార్కెట్‌యార్డులు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. మార్కెటింగ్‌శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ మార్కెట్‌యార్డు చైర్మన్లు మార్కెట్‌కు వచ్చే రైతులకు సౌకర్యాలను కల్పించడంతోపాటు మార్కెట్‌యార్డులో వసతులను కల్పించి రైతుల మన్ననలు పొందాలన్నారు. మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య మాట్లాడుతూ అమ్మకందారులు, కొనుగోలు దారుల మధ్య సమన్వయం ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ అజాద్‌వలీ, కడప మార్కెట్‌యార్డు సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డితోపాటు సిబ్బంది, వివిధ జిల్లాల మార్కెట్‌యార్డు చైర్మన్లు పాల్గొన్నారు.
అలా వచ్చి.. ఇలా కారెక్కి..
కడప నగరంలోని మార్కెట్‌యార్డును మంగళవారం ఉదయం మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ విజయ సునీత సందర్శించారు. మార్కెటింగ్‌శాఖ సెక్రటరీ, సిబ్బంది స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె వారితో కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి కారెక్కి రయ్‌మని వెళ్లిపోయారు. మార్కెట్‌యార్డుకు వచ్చిన ఆమె యార్డులో వసతుల గురించి, ఏళ్లుగా ఆగిపోయి ఉన్న షెడ్డు నిర్మాణ పనులు, రైతుల సమస్యలు, మార్కెట్‌లో మరుగుదొడ్లు, మంచినీటి సమస్య, రైతుల వసతిగృహం తదితర విషయాలు ఏమీ అడగకుండా వెళ్లిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ విజయ సునీత


