వైఎస్సార్‌సీపీ నేతలకు 41ఏ నోటీసులు
కడప అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలను చేపడుతోంది. ఇందుకోసం పోలీసు అధికారులను ఉసిగొల్పి అక్రమ కేసులను బనాయించి తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కడపలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత బస్టాండ్ సమీపంలో నవంబర్ 25వ తేదీన యాదాళ్ల నాగమ్మ ట్రస్ట్ స్థలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేపట్టిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలపై కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అదే రోజు సాయంత్రం క్రైమ్ నంబర్: 281/2025 కింద కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసే ముందు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పి.పుష్పరాజు, కానిస్టేబుల్ రాముడు నాయక్‌ల దగ్గర స్పెషల్ రిపోర్టు ద్వారా చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా వైఎస్సార్‌సీపీ నేతలు కడప కార్పొరేషన్ 25వ డివిజన్ ఇన్‌చార్జి షేక్ షఫీ, 21వ డివిజన్ ఇన్‌చార్జి శ్రీరంజన్ రెడ్డి, 23వ డివిజన్ ఇన్‌చార్జి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ ఐస్ క్రీం రవి, మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య, సీనియర్ లీడర్ జయచంద్రారెడ్డి, యువజన నాయకుడు గుంటి నాగేంద్ర, శంకరాపురానికి చెందిన సింధు, ఇంకా కొంత మందిపై అక్రమ కేసు బనాయించారు. మంగళవారం ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలను పిలిపించి కడప వన్ టౌన్ పోలీసులు 41 ఏ నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కొందరు కడప పాత బస్టాండ్ సమీపంలో ఉన్న యాదాళ్ల నాగమ్మ సత్రంలో అక్రమ కట్టడాలను నిర్మిస్తుండగా తాము అడ్డుకునే ప్రయత్నం చేశామన్నారు. అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, కేవలం అప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అక్రమ కట్టడాలను అడ్డుకునేందుకు వెళ్లిన తమపై అనుమతులు తీసుకోలేదనే నెపంతో అక్రమంగా కేసులు బనాయించారన్నారు. కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలుగా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు.
యాదాళ్ల నాగమ్మ ట్రస్ట్ స్థలంలో
టీడీపీ నాయకుల అక్రమ నిర్మాణాలను
అడ్డుకున్నందుకు కక్ష సాధింపు


