
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
కడప సెవెన్‌రోడ్స్ : సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాల వారు ధర్నాలు చేపట్టడంతో సోమవారం కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎమ్మార్పీఎస్ (దండు వీరయ్య మాదిగ) నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ సంఘం నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, నాగభూషణం మాట్లాడుతూ దివ్యాంగుల జనాభా దామాషా మేరకు ఆరుశాతం పైబడి ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సహదేవుడు, నరసింహులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్లకు న్యాయం చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఈపీఎస్–95 పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఈపీఎస్–95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు డీఏతో కలిపి చెల్లించాలన్నారు. 8వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఎన్‌పీఎస్, యూపీఎస్, సీపీఎస్‌లను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 20 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తినాయుడు, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఎ.రఘునాథ్‌రెడ్డితోపాటు ఇతర నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
నారా లోకేష్ రాజీనామా చేయాలి
విద్యారంగ సమస్యలు పరిష్కరించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాహుల్ రవి డిమాండ్ చేశారు. సోమవారం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు గడుస్తున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు అజయ్, రాజశేఖర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోహన్, జెర్మియా, చారి, నగర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్