
కబోది..ప్రభుత్వమిది
రెండు కాళ్లు చచ్చుబడి వీల్‌చైర్‌పై ఒకరు..
రెండు కర్రల సాయంతో కష్టంగా మరొకరు..
కళ్లు కనబడక ఇంకొకరు... మాట వినబడక మరొకరు..
భారాన్ని.. దూరాన్ని లెక్కజేయకుండా కలెక్టరేట్‌కు వచ్చారు. వారు నడుస్తుంటే గస బుసలుకొడుతోంది..
అయినా అడుగాపకుండా
కలెక్టరేట్ వైపు అడుగులేస్తున్నారు..
‘ఏంటవ్వా’ అని పలకరిస్తే..
‘ఏమైంది పెద్దాయనా’ అని మాట కలిపితే..
‘మా పింఛనీ తీసేసినారంటయ్యా’
అని దీనంగా చెప్పారు.
ఆ క్షణంలో తెలియకుండానే వారి కళ్లల్లోంచి
కన్నీళ్లు రాలిపడ్డాయి..
నాకు 45 శాతం వైకల్యం ఉన్నప్పుడు 2010 ఆగస్టు 16వ తేది రిమ్స్ వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో పెన్షన్ వచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వెరిఫికేషన్ పేరుతో 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉందంటూ నోటీసులు జారీ చేసి పింఛన్ తొలగించడం అన్యాయం.
– బత్తుల చిన్నవెంకటేశు, కొండూరు బీసీ కాలనీ, అట్లూరు మండలం
నేను రూ. 200 ఉన్నప్పటినుంచి పెన్షన్ తీసుకుంటున్నాను. అప్పట్లో 90 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రీ వెరిఫికేషన్ పేరుతో 70 శాతమే వైకల్యం ఉందంటూ సర్టిఫికెట్‌జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా పెన్షన్ మొత్తాన్ని తగ్గించేందుకు చేస్తున్న కార్యక్రమం. – చిన్నగుర్రప్ప, మైలవరం
నాకు 90 శాతం వైకల్యం ఉన్నట్లు 2007లో సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు 64 శాతం ఉన్నట్లు పేర్కొనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా ఫొటోకు బ దులుగా వేరే మహిళ ఫోటో జతపరిచి సర్టిఫికెట్ ఇచ్చారు. పాత పెన్షన్ పునరుద్ధరించాలి.
– డి.అఫ్జల్, శ్రీనివాసనగర్, ప్రొద్దుటూరు
ఈ చిత్రంలో వీల్‌చైర్‌లో కనిపిస్తున్న వ్యక్తి పేరు షరీప్. పులివెందుల నియోజకవర్గం వేల్పుల. ఐదేళ్ల్ల క్రితం పక్షవాతంతో మంచంలో పడ్డాడు. రెండు కాళ్లు, చేతులు పనిచేయక పోవడంతో దివ్యాంగుల పెన్షన్ వస్తుంది. పెన్షన్‌తో పూట గడవడం ఇబ్బందిగా మారడంతో భార్య ఫకృన్నిసా వ్యవసాయం కూలిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు కుమార్తెలు కలిగిన వీరికి కూటమి ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. రీవెరిఫికేషన్ పేరుతో సదరం సర్టిఫికెట్ తెచ్చుకోమని అధికారులు కడప జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. రెండో సారి నెల ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికీ పంపించారు. ప్రయాస పడి అక్కడ కూడా రీ వెరిఫికేషన్ కు హాజరయ్యా రు. చివరికి ఈ నెలలో మీకు పెన్షన్ రాదూ అని చెప్పడంతో పాపం షరీఫ్ కుటుంబ సభ్యులు భార్య, పిల్లలతో కలెక్టరేట్‌కుకు వచ్చారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడుకు తాము పడిన బాధలు తెలియజేశారు. ఎన్నో వ్యయ ప్రయాస పడి వేల్పుల నుంచి ఆటోలో 1500 రూపాయిలు బాడుగా చెల్లించుకొని వచ్చామని.. దయ చూపి తన భర్తకు దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరణ చేయండి సార్ అంటూ తన చిన్నారులకు చూపిస్తూ షరీఫ్ భార్య ఫకృన్నీసా కంటనీరు పెట్టింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప

కబోది..ప్రభుత్వమిది

కబోది..ప్రభుత్వమిది

కబోది..ప్రభుత్వమిది

కబోది..ప్రభుత్వమిది