
మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : గణేష్ ఉత్సవాల్లో మట్టి వినాయక ప్రతిమలను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ సహిత మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేలా.. రాష్ట్ర పర్యావరణ నియంత్రణ మండలి వారు రూపొందించిన పోస్టర్‌లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కలెక్టర్‌కు మట్టి వినాయకుడి ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మట్టివిగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన పెంచేలా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (ిపీఓపీ) విగ్రహాలను వాడడం వల్ల చెరువులు, నదులు, ఇతర జల వనరులు కాలుష్యం అవుతున్నాయన్నారు. జిల్లా పర్యావరణ ఇంజనీర్ సుధా కురుబ, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా. శారద, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.