
ఏమిటీ అన్యాయం?
మైలవరం : ఆమె జన్మతః అంధురాలు. రెండు కళ్లు బొత్తిగా కనిపించవు. బాల్యం నుంచి వికలాంగుల పెన్షన్ అందుకుంటున్న ఆమెకు ప్రస్తుతం 49 సంవత్సరాల వయసు. పుట్టుకతోనే అంధురాలు కావడంతో ఆమెకు వివాహం కాలేదు. నేటికి ఒంటరి మహిళగానే బతుకు బండిని నెట్టుకు వస్తూ జీవన పోరాటం చేస్తోంది. ఆమె పెన్షన్ అందుకుంటున్న మూడు దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి.. ఏ ఒక్కరూ ఆమె పెన్షన్‌పై కత్తి కట్టలేదు. అలాంటిది చంద్రబాబు సర్కార్ ఏమంటూ వచ్చిందో గాని పుట్టు అంధురాలైన ఆమె పెన్షన్‌ను ఉన్నపళంగా నిలిపి వేసింది. వందశాతం అంధత్వం ఉన్న ఆ అంధురాలి పింఛన్ నిలిపివేయటానికి అధికారులకు చేతులు ఎలా వచ్చాయో అని ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది.
పాపం దస్తగిరమ్మ..!
మైలవరం మండలం చిన్న వెంతుర్ల గ్రామానికి చెందిన దస్తగిరమ్మకు పుట్టుకతోనే చూపు లేదు. వందశాతం అంధత్వం ఉన్నట్లు ఎప్పుడో వైద్యులు ధ్రువీకరించారు. ఆ తర్వాత పలుమార్లు జరిపిన వైద్యపరీక్షల్లో కూడా వంద శాతం అంధత్వం ఉన్నట్లే ధ్రువీకరణ పత్రాలు ఇస్తూ వచ్చారు. గత 30 సంవత్సరాలుగా ఆమె పెన్షన్ అందుకుంటూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత బోగస్ పెన్షన్‌ల ఏరివేతలో భాగంగా దివ్యాంగులందరికి తాజాగా వైద్య పరీక్షలు చేయించారు. దస్తగిరమ్మకు ఈ ఏడాది మార్చి నెలలో వైద్య పరీక్షలు చేసి పంపించారు. అంతా సవ్యంగా జరిగిందన్న తరుణంలో నాలుగు రోజుల క్రితం దస్తగిరమ్మకు పెన్షన్ నిలిపి వేస్తున్నట్లు నోటీసులు అందాయి. విషయం ఏమిటని ఆరాతీస్తే తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించిన ఆ వైద్య మహానుభావుడు ఆమెకు కేవలం 20 శాతం మాత్రమే అంధత్వం ఉన్నట్లు ధ్రువీకరించాడట. ఆ సర్టిఫికెట్ ఆధారంగా రెండు కళ్లులేని ఆమెకు సంబంధింత అధికారులు సైతం కళ్లు మూసుకుని పెన్షన్ పెరికేశారు.
ఆమె గోడు ఎవరికి చెప్పుకోవాలి?
పుట్టుకతో అంధురాలైన దస్తగిరమ్మకు బాల్యంలోనే తల్లి చనిపోయింది. వృద్ధుడైన తండ్రి దస్తగిరి చెంతనే ఆమె జీవనం సాగిస్తోంది. అవివాహితురాలైన ఆమెకు పింఛన్ ఒక్కటే ఆధారం. పింఛన్ వస్తుండటంతో ఆమెకు ఏ ప్రభుత్వ పథకం వర్తించదు. రెండు కన్నులు కనిపించకపోవడంతో పొలం పనులకు సైతం ఆమె వెళ్లలేని పరిస్థితి తండ్రికి భారం కాకుండా ఇంట్లోనే ఉంటూ తన పని తానే చేసుకుంటుంది. అంతటి దయనీయ జీవితం గడుపుతున్న ఆమెకు పింఛన్ నిలిపివేసి ప్రభుత్వం సాఽధించింది ఏమిటి. వైద్యులు తిరిగి పరీక్షలు నిర్వహించి ఆమె పింఛన్ పునరుద్ధరించాలంటే కనీసం రెండు మూడు నెలల సమయం తర్వాత దరఖాస్తు చేసుకుంటే తిరిగి పింఛన్ అర్హత ఉంటే పింఛన్ పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ తతంగం జరిగే సరికి రెండు మూడు నెలల కాలం గడిచిపోతుంది. ఆ మధ్యలో ఆమెకు పింఛన్ ఎవరిస్తారు? ఒకటో తేదీన పరిస్థితి ఏమిటి. ఆమెకు కాదు వైద్యులకే అంధత్వం పుట్టుకతో వచ్చినట్లు ఉంది. ఆమెకు చంద్రబాబు నాయుడు సర్కార్ పుణ్యమా అంటూ పింఛన్ తొలగించడం ముక్కున వేలు వేసుకునేలా చేసింది. చివరకు అధికారులు సైతం నివ్వెర పోతున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుడికి ఈమె అంధత్వం కనిపించలేదా. లేదా పరీక్షలు చేయకుండానే ఏసీ రూముల్లో కూర్చొని గుడ్డిగా సర్టిఫికెట్ మంజూరు చేశారా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా దివ్యాంగుల జీవితంతో చెలగాటమాడటం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు కళ్లులేని పుట్టు అంధురాలికి పెన్షన్ నిలిపివేత
ఐదు నెలలక్రితం వైద్య పరీక్షలు..
తాజాగా నోటీసులు
దివ్యాంగులపై కక్షగట్టిన సర్కార్
దురాగతానికి ఇదో తార్కాణం

ఏమిటీ అన్యాయం?

ఏమిటీ అన్యాయం?

ఏమిటీ అన్యాయం?