
మహిళ ఆత్మహత్య
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం ముద్దనూరు రోడ్డు సమీపంలో ఉన్న చెన్నారెడ్డి కాలనీలో గోగుల సురేఖ అనే మహిళ కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. సురేఖ భర్త చిన్నబ్రహ్మం కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా సురేఖ కడుపు నొప్పితో బాధపడుతుండేది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సురేఖ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
బాల్య వివాహాలను అరికట్టాలి
కడప అర్బన్ : గిరిజనులు బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భ ధారణ తదితర అంశాలపై అవగాహన కలిగి బాల్య వివాహాలను అరికట్టాలని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాదులు మనోహర్, రవితేజ పేర్కొన్నారు. సోమవారం కడప నగరం సరోజిని ఎస్టీ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానాలకు చేర్చాలన్నారు. విద్యా హక్కు చట్టం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్స్ ఎన్జీఓ కోఆర్డినేటర్ రవీంద్రనాథ్, సీఎస్‌డబ్ల్యుఓ నిర్మల, పారా లీగల్ వలంటీర్ దశరథరామిరెడ్డి, గిరిజనులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి యోగాసన
ఎంపికలు
వేంపల్లె : స్థానిక శ్లోక ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో రాష్ట్రస్థాయి యోగాసన ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా ప్రెసిడెంట్ అనిల్, సెక్రటరీ తేజ పేర్కొన్నారు. సోమవారం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీ ల్లో 70 మంది ట్రీపుల్ ఐటీ, కడప, పులివెందుల, తొండూరు తదితర ప్రాంతాల క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. విజేతలు సెప్టెంబర్ నెల 6, 7 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి గుప్తా, ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్వహణ కోఆర్డినేటర్ పవన్ కుమా ర్, శ్లోక స్కూల్ కరస్పాండెంట్ నవనీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ సురేంద్ర విజేతలకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ అబ్జర్వర్ మనోహర్ రెడ్డి, టెక్నికల్ రిఫ్రికేశవ తదితరులు పాల్గొన్నారు.