
రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం
● స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు
● ఇద్దరు యువకుల దుర్మరణం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని కేంద్ర కారాగారం సమీపంలో ఈనెల 24వ తేదీన రాత్రి సమయంలో కడప వైపు నుంచి స్కూటీలో వెళుతున్న ఇద్దరు యువకులను, తిరుపతి వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మోదుగుల నవీన్‌కుమార్ (22), అతని స్నేహితుడు అంచల చరణ్ (20)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లోనూ, స్నేహితులను విషాదంలో నింపింది. మరణించిన ఇద్దరిలో నవీన్‌కుమార్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి శ్రీహరి, తల్లి సుజితలు. శ్రీహరి ఐరన్ మార్ట్‌ల వద్ద ఆటో బాడుగకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి నవీన్‌కుమార్ కంటే ముందు ఓ కుమారుడు ఉండేవాడు. ఆ పిల్లాడు చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరు శంకరాపురంలో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రవి, విజయల కుమారుడు అంచల చరణ్ కొత్త బస్టాండ్ సమీపంలో ఓ దుకాణంలో మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చరణ్‌కు డిగ్రీ చదువుతున్న షాలిని అనే చెల్లెలు ఉంది. రెండు కుటుంబాల్లోనూ ఒక్కొక్కరే కుమారులు. వీరిద్దరు ఈనెల 24వ తేదీన రాత్రి సైనిక్ నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్ బంధువుల ఇంటికి పనిమీద బయలు దేరారు. కడప కేంద్ర కారాగారం సమీపంలోకి వెళ్లగానే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొనడంతో స్కూటీలో నుంచి ఎగిరిపడి ముందు భాగాన చరణ్ తల తగలగానే తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్‌కుమార్ కూడా తీవ్రంగా గాయపడి ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే మార్గంలో వెళుతున్న నవీన్‌కుమార్ తండ్రి శ్రీహరి స్నేహితుడు ప్రమాదం గురించి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మరణించడంతో తీవ్రంగా విలపించారు. తల్లిదండ్రులకు ఈ దుర్ఘటన కడుపుకోతనే మిగిల్చింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన తరువాత మృతదేహాలను వెంటనే రిమ్స్‌కు తరలించారు. సోమవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ట్రాఫిక్ సీఐ జావేద్ తెలిపారు.

రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం

రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం

రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం

రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం