సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు
రాయచోటి టౌన్ : నూనె గింజల పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని భారత నూనె గింజల పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగేష్ దుబే అన్నారు. గురువారం రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామంలో నూనె గింజల సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 700 జిల్లాలో రెండు వేలకు పైగా శాసీ్త్రయ బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు మాట్లాడుతూ నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్నారు. పండ్ల తోటల సాగులో కూడా కొత్తరకాల పండ్ల తోటలను ఎంచకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా మంచి దిగుబడులతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని చెప్పారు. ఏరువాక (ఖరీఫ్) సేద్యానికి రైతులు సిద్ధం కావాలని రాయచోటి వ్యవసాయ శాఖ అధికారి దివాకర్ రైతులకు కోరారు. వేరుశనగ, కంది, నువ్వులు వంటి వ్యవసాయ పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులను కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరి సూచించారు. డాక్టర్ ఐ.సురేష్ కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ నాగేశ్వరరావు, రైతులు రామకృష్ణం రాజు, ఉద్యానశాఖ అధికారిణి నాగమణి, ఆత్మ ఏటీఎంలు, రైతులు పాల్గొన్నారు.


