ప్రజలకు క్షమాపణ చెప్పండి: అంజద్‌బాషా
ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు వేదికగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఎద్దేవా చేశారు. మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు స్వాతంత్య్ర సమరయోధులు, మహానాయకుల విగ్రహాలకు పార్టీ జెండాలు కట్టడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏం సాధించారని, ఏం ఘన కార్యాలు చేశారని మహానాడు నిర్వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి వాటిని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ అడ్డాలో మహానాడు నిర్వహించామని టీడీపీ నేతలు సంబరపడుతున్నారని, ఇది ఎప్పటికీ జగన్ అడ్డానేనని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర టీడీపీకి లేదు: సురేష్ బాబు
రాష్ట్ర చరిత్రలో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదని మేయర్ సురేష్ బాబు అన్నారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. కడపలో మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్‌ల వల్లే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని, దుష్టబుద్ధితో వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చారని మండిపడ్డారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేయాలని మహానాడులో తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అధికార, పోలీసు యంత్రాంగం అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని, వారం రోజులుగా వారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి మహానాడు కార్యక్రమం ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారని విమర్శించారు.


