గీతాశ్రమంపై నివేదిక ఇవ్వండి
ప్రొద్దుటూరు : గీతాశ్రమంలోని మలయాళ స్వామి బీఈడీ కళాశాల నిర్వహణపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) గురు ప్రసాద్ తెలిపారు. దేవ దేవా.. ఆదాయం స్వాహా, దేవుడి సొమ్మును దోచుకుతింటున్నారు అంటూ ప్రచురితమైన సాక్షి కథనాలకు ఆయన స్పందించారు. శుక్రవారం గీతాశ్రమాన్ని డిప్యూటీ కమిషనర్ సందర్శించి వివరాలు సేకరించారు. మలయాళస్వామి బీఈడీ కళాశాల భవనాలు పరిశీలించారు. ఎందుకు అద్దె చెల్లించడం లేదు? అని కళాశాల ప్రతినిధి సుదర్శన్‌రెడ్డిని ఆరా తీశారు. తమ కళాశాలకు సంబంధించి రూ.18 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని సుదర్శన్ రెడ్డి తెలపగా.. అందులో వాస్తవం లేదని ఈవో అన్నారు. ఆ డబ్బు గంగాధరానందగిరి స్వామి జమ చేశారని, దానితో కళాశాలకు సంబంధం లేదన్నారు. వెంటనే అద్దె చెల్లించకపోవడంపై తగిన ఆధారాలతో సహా నివేదిక సమర్పించాలని ఈఓను ఆదేశించారు. అనంతరం అక్కడికి వచ్చిన కళాశాల చైర్మెన్ సురేష్‌బాబురెడ్డి డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు.
ఈవోపై చర్యలు తీసుకోవాలి
అక్రమాలకు పాల్పడుతున్న ఈఓ రామచంద్రాచార్యులుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు గౌరీ శంకర్ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్‌కు విన్నవించారు. కళాశాల భవనాలకు రూ.60 వేల వరకు అద్దె వచ్చే అవకాశం ఉన్నా, రూ.29 వేలకే ఇచ్చారని అన్నారు. గతంలో తొలగించిన ఉద్యోగి జనార్దన్‌రెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా పాత బకాయిలు రూ.5 లక్షలు చెల్లించారన్నారు. శ్రీకృష్ణ గీతాశ్రమానికి అనధికారికంగా తానే ఈవోనని ఆశ్రమాన్ని నడిపిస్తున్నారని జనసేన ప్రొద్దుటూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాదాసు మురళి డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్
గీతాశ్రమంపై నివేదిక ఇవ్వండి


