రిమ్స్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు!
కడప టాస్క్‌ఫోర్స్ : జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కడప రిమ్స్ ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోగులకు సేవ చేసేందుకే తాము విధుల్లో ఉన్నామనే కనీస బాధ్యతను విస్మరించి కొందరు వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పేద రోగులంటే వారి దృష్టిలో మనుషులు కాదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో రిమ్స్ దుస్థితిపై పత్రికల్లో కథనాలు వెలువడినా అధికారుల్లో కనీస చలనం లేదు. తాజాగా సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఎముకల విభాగం, గైనకాలజీ విభాగాల్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉదయం 9:40 గంటల సమయమైనా ఓపీలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడం గమనార్హం. రకరకాల సమస్యలతో బాధపడుతూ వైద్యం కోసం వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు వైద్యుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని విభాగాలలో పీజీలు, హౌస్ సర్జన్‌లకే వైద్య పరీక్షల సేవలను అప్పగించి వైద్యులు మాత్రం కళాశాల వద్దకో, లేక వార్డులకో వెళ్లినట్లుగా చెప్పుకొస్తున్నారు. వీరిలో చాలామంది బయోమెట్రిక్, ఎఫ్‌ఆర్‌ఎస్‌లను వేసి, కడప నగరంలోని తమ సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి.
● ఏబీహెచ్‌ఏ (అభా) అప్లికేషన్‌ను రోగులు, వారి బంధువుల ‘ఆండ్రాయిడ్’ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేయించే విషయంలో అక్కడి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కానీ, లేక సులువుగా అప్లికేషన్ పొందుపరిచే విషయంలోగానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్లుగానీ, ఇతర వైద్య సిబ్బందిగానీ పట్టించుకోవడం లేదు. దీంతో ఓపీ చీటీల కౌంటర్ వద్ద కొన్ని అడుగుల దూరం రోగులు, వారి సహాయకులు వేయాలంటేనే అరగంట నుంచి గంట సమయం పడుతోంది. ఓపీ, ఐపీ విభాగాలలో విధులను నిర్వహిస్తున్న డీఈఓలు 6 మంది, స్టాఫ్ నర్స్ పోస్టులలో ఎంపికై డీఈఓలుగా విధులు నిర్వహిస్తున్న వారు 13 మందిలో కొందరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ సమయపాలన పాటించాల్సి ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 లేక 12:30 గంటలకే తమ విధులను ‘మమ’ అనిపించుకుంటున్నారు. ఓపీ వేళలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరలా 2 గంటల నుంచి 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంది. మధ్యాహ్నం ఓపీ వేళలలో కొందరు డాక్టర్లు, డీఈఓలలో కొందరు ఎఫ్‌ఆర్‌ఎస్, బయోమెట్రిక్ సమయాలలో అంటే సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆ ప్రక్రియ ముగించుకుని తమదారిన తాము వెళ్లిపోతున్నారు. వీరిపై పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ‘పక్కా’ ఆధారాలుంటే చూపించండి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
● వార్డులలో విధులను నిర్వహిస్తున్న డాక్టర్లలో కొందరు, స్టాఫ్, హెడ్ నర్సులలో కొందరు నిక్కచ్చిగా తమకు కేటాయించిన విధులను నిర్వహిస్తుంటే, మరికొందరు మాత్రం ‘నామమాత్రంగా’ విధులను నిర్వహిస్తున్నారు. హెడ్ నర్సులు సమయపాలన పాటించకపోవడం, తమకు కేటాయించిన వార్డులన్నీ పరిశీలించకుండానే ఒకే చోట కూర్చుని రికార్డులను తెప్పించుకుని ‘కాలక్షేపం’ చేస్తున్నారు.
● జీజీహెచ్ రిమ్స్‌కు వచ్చే రోగుల, వారి సహాయకులు దాహార్తిని తీర్చే విషయంలో ఇంకా అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కడప నగర పాలక సంస్థ నుంచి ఒప్పందం ప్రకారం రిమ్స్‌కు సరఫరా చేయాల్సిన 2లక్షల గ్యాలన్ల నీటిని ప్రతి రోజు సక్రమంగా సరఫరా చేయడం లేదు. నాలుగు రోజులకు ఒకసారి కూడా ఈ నీటిని సరఫరా చేయకపోవడం గమనార్హం. ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి కొందరు వాటర్‌మాన్‌లు ఈ నీటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నీటి వ్యాపారులకు అప్పనంగా అమ్మేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● కడప సెంట్రల్ ల్యాబ్ విభాగాలలో సామగ్రిని తీసుకుని రావడంలో పారామెడికల్ కోర్సులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులే ఫార్మసీ విభాగం నుంచి తీసుకుని వస్తున్నారు. ల్యాబ్ విభాగాలలో విధులను నిర్వహిస్తున్న అటెండర్లు వారికి కేటాయించిన విధులలో కాకుండా ఇతర విభాగాలలో పనిచేస్తున్నారు. రిమ్స్‌ను పట్టి పీడిస్తున్న నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఓపీలోని కొన్ని విభాగాల్లో సమయం
పాటించని డాక్టర్లు
‘ఏబీహెచ్‌ఏ’(ఆభా) అప్లికేషన్ అప్‌లోడ్ కోసం తప్పని నిరీక్షణ
వార్డుల్లో కొందరు డాక్టర్లు, హెడ్ నర్సుల కాలక్షేపం
ఇంతవరకు పరిష్కారం కాని నీటి సమస్య
రిమ్స్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు!
రిమ్స్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు!
రిమ్స్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు!


