కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాల బాలికల చదువుకు కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) బాసటగా నిలుస్తున్నాయి. ఉచిత వసతితోపాటు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ ఆదరిస్తున్నాయి. బాలికల ఉజ్వల భవిష్యత్తుకు గట్టిపునాది వేస్తున్నాయి. తాజాగా కేజీబీవీల్లో 6వ తరగతితోపాటు ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ప్రత్యేక కథనం.
● నిరుపేద కుటుంబాల బాలికలకు
సదవకాశం
● ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
● ఆరో తరగతి, ఇంటర్‌లో
ప్రవేశాలకు అవకాశం
● ఏప్రిల్ 11 దరఖాస్తుకు తుది గడువు
● 17 కేజీబీవీల్లో భర్తీకానున్న 1602 సీట్లు
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్న సదాశయంతో బాలికల అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల పరిధిలో ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేసింది. ఈ కేజీబీవీలు మొదట్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేది. 10వ తరగతి తరువాత విద్యార్థు లు చదువుకు దూరమవుతున్నట్లు తెలియడంతో మళ్లీ ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టారు. 2024–25వ విద్యా సంవత్సరానికి సంబంధించి 17 కేజీబీవీల్లో 6వ తరగతిలో 680, ఇంటర్మీడియట్‌లో 680 సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే 7వ తరగతిలో ఖాళీగా ఉన్న 23 సీట్లు, 8వ తరగతిలో ఖాళీగా 13 సీట్లు, 9వ తరగతిలో 14 సీట్లు, 10వ తరగతిలో 29 సీట్లు, 12వ తరగతిలో 163 సీట్లు ఇలా మొత్తంగా అన్ని కలిపి 1602 సీట్లు భర్తీకానున్నాయి.
అర్హులెవరంటే..
బడిబయటి పిల్లలు, బడి మానేసిన పిల్లలు, అంగవైకల్యం, అనాథలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యతగా సీట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఎంపికై న బాలికలకు ఫోన్‌కు మేసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. లేదంటే సంబంధింత కేజీబీవీ నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చు. ఏవైనా సమస్యలు సందేహాలు ఉంటే 7075159996, 7075039990 నంబర్లలో సంప్రదించవచ్చు.
జిల్లాలో ఇంటర్ ఉన్న కేజీబీవీల వివరాలు
జిల్లాలో అట్లూరు, చాపాడు, దువ్వూరు, పెద్దముడియం, పోరుమామిళ్ల, ఎస్‌ఏ కాశినాయన, సింహాద్రిపురం కేజీబీవీలలో ఎంపీసీ గ్రూపు ఉండగా, బి.కోడూరు, బిమఠం, చక్రాయపేట, ఖాజీపేట, మైదుకూరు, పెండ్లిమర్రి, వల్లూరు, వేముల కేజీబీవీల్లో బైపీసీ, కలసపాడు కేజీబీవీలో హెచ్‌ఈసీ, జమల్మమడుగు కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్లూ గ్రూపులు ఉన్నాయి.
అడ్మిషన్ల కోసం...
విద్యార్థిని తల్లి, తండ్రిలకు సంబంధించిన ఆధార్ కార్డు, తల్లిదండ్రులు లేకుంటే సంరక్షకుల ఆధార్‌కార్డు, విద్యార్థినికి సంబంధించి 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్‌ను ఇవ్వాల్సి ఉంది.ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ఈనెల 22 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు


