కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మేజర్ జనరల్ అజయ్‌మిశ్రా అన్నారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మాజీ సైనికుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మేజర్ జనరల్ అజయ్‌మిశ్రా, బ్రిగేడియర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించారు. కల్నల్ మాథ్యూ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ సైనికులకు పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన తొమ్మది మంది దివంగత సైనికుల సతీమణులను ఘనంగా సత్కరించారు. వారికి చీర, మెమెంటో, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు బహూకరించారు. మాజీ రిక్రూట్ సహదేవరెడ్డికి ట్రై స్కూటర్ అందించారు. అలాగే తొమ్మిది మంది మాజీ సైనికులకు ట్రై ప్యాడ్, వాకింగ్ స్టిక్స్, ఐదుగురికి వీల్ చైర్లు అందజేశారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజాక్‌ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కల్నల్ ఎస్‌కే సింగ్, జాయింట్ డైరెక్టర్ హాస్పిటల్ సర్వీసెస్ కల్నల్ ఆర్.దత్తా, కల్నల్ బి.బుధౌరి, ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ అధికారి బ్రిగేడియర్ వెంకటరెడ్డి, కల్నల్ రాంప్రకాశ్, కల్నల్ కుల్‌దీప్‌మానె, కల్నల్ అశ్విన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు కార్యక్రమంలో పాల్గొని తమ శాఖ ద్వారా అందించిన వైద్య సేవలను పర్యవేక్షించారు.
మేజర్ జనరల్ అజయ్‌మిశ్రా