భువనగిరి: రాష్ట్రంలో ఆరు దశాబ్దాల ఇంటర్మీడియట్ విద్యకు తెరపడనుంది. 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా రూపొందించిన మూడంచెల విధానంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ విద్య, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా విభజించనున్నారు. ఈ నిర్ణయంతో సెకండరీ పాఠశాలలు లేని కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది.
పాఠశాల విద్యలో విలీనం
జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి 56 జూనియర్ కళాశాలలు ఉండగా, వాటిలో సుమారు 6,215 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే పదో తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 168 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులు సుమారు 10 వేల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి ఉన్నత పాఠశాలలు 9 నుంచి 12 తరగతులతో సీనియర్ సెకండరీ స్కూళ్లుగా మారనున్నాయి. జూనియర్ కళాశాలల్లో సైతం మైదానం, ల్యాబ్, లైబ్రరీ, తరగతి గదులు అందుబాటులో ఉన్నందున నిబంధనల ప్రకారం వాటిలోనూ 9 నుంచి 12 తరగతులు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వవచ్చని భావిస్తున్నారు. వీటికి తోడు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో కూడా ఇంటర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటికే కేజీబీవీ, మోడల్ స్కూల్స్‌లో ఇంటర్ విద్య కొనసాగుతోంది.
డ్రాపౌట్స్ తగ్గించాలనే లక్ష్యంతో..
పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌కు వెళ్లేసరికి సుమారు 40 శాతం మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని (డ్రాపౌట్స్) గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా బాలికలు దూరంగా ఉన్న కళాశాలలకు వెళ్లలేక చదువు ఆపేస్తున్నారని తెలుస్తోంది. అలాగే దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల పిల్లలు సైతం పదో తరగతితోనే సరిపెట్టుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో భాష, సమాచార నైపుణ్యాలను పెంపొందించే చర్యలు తీసుకోనున్నారు.
ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారని..
ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. కనీసం ప్రైవేట్ కళాశాలల సంఘాలను సంప్రదించకుండా ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవడంతో యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. మరోవైపు పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయడంతో ప్రైవేటు కళాశాలలు చాలా వరకు మూతబడే ప్రమాదం ఉండటంతో అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు.
పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే అమలు చేయాలి
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేసి వెంటనే అమలు చేయడం సాధ్యం కాదు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 9, 10 తరగతుల విద్యార్థులు జూనియర్ కళాశాలల్లోకి వస్తే అధ్యాపకులకు బీఈడీ అర్హత ఉండదు కాబట్టి వారికి బోధన ఇబ్బందిగా మారుతుంది. అలాగే సెకండరీ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశపెడితే స్కూల్ అసిస్టెంట్లకు ఇంటర్ పాఠ్యాంశాల బోధన కష్టమవుతుంది. సుమారు రెండేళ్ల పాటు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
– సూర్యనారాయణరెడ్డి, విద్యావేత్త, భువనగిరి
ఫ వచ్చే విద్యా సంవత్సరం నుంచి
10+2 విధానం అమలు
ఫ ఆరు దశాబ్దాల ఇంటర్ విద్యకు తెర
ఫ ఆందోళనలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు


