120 గృహాల్లోనే ప్రవేశాలు! | - | Sakshi
Sakshi News home page

120 గృహాల్లోనే ప్రవేశాలు!

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

వసతులు కల్పించాలి

భువనగిరి : పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన 444 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో ఇప్పటి వరకు కేవలం 120 ఇళ్లలోనే గృహప్రవేశాలు జరిగాయి. మౌలిక వసతుల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో, ఇళ్ల తాళాలు చేతికి అందినప్పటికీ మిగిలిన 288 మంది లబ్ధిదారులు కొత్త ఇంట్లో అడుగుపెట్టలేని దుస్థితి నెలకొంది. మరోవైపు బస్వాపురం మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన 116 ఇళ్లు అసంపూర్తిగా ఉండి శిథిలావస్థకు చేరాయి. పూర్తిస్థాయి వసతులు కల్పించి ఇళ్లను తక్షణమే అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ లబ్ధిదారులు ఆందోళనకు దిగుతున్నారు.

నిలిచిన పనులు..

సింగన్నగూడెం వద్ద జీ ప్లస్‌ 2 పద్ధతిలో మొత్తం 37 బ్లాక్‌లను (బ్లాక్‌కు 12 ఇళ్ల చొప్పున 444 ఇళ్లు) నిర్మించారు. వీటిలో 10 బ్లాక్‌లలోని 120 ఇళ్లకు మాత్రమే మౌలిక వసతులు పూర్తి చేసి, గత ఆగస్టు 31న పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేయించారు. ఇంకా 27 బ్లాక్‌లలోని 288 ఇళ్లలో వసతుల కల్పన పెండింగ్‌లో ఉంది. చేసిన పనులకు బిల్లులు మంజూరు కావడం లేదంటూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీంతో తాళాలు అందుకున్న లబ్ధిదారులు సైతం గృహప్రవేశం చేయలేకపోతున్నారు. రెండో వి డతలో కేటాయించాల్సిన మరో 36 ఇళ్లలోనూ కనీస వసతులు కల్పించాల్సి ఉంది. నిరుపయోగంగా ఉన్న ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

850 ఇళ్లు మంజూరైతే..

గత ప్రభుత్వం భువనగిరి పట్టణానికి 850 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేయగా, సింగన్నగూడెం వద్ద 444 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటి కోసం 4,815 దరఖాస్తులు రాగా, 1,950 మందిని అర్హులుగా గుర్తించారు. 2023 మార్చి 29న కలెక్టరేట్‌లో డ్రా పద్ధతి ద్వారా 444 మందిని ఎంపిక చేశారు. అనంతరం 2024లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రత్యేక చొరవ తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి మౌలిక వసతుల కల్పన కోసం రూ.33.43 కోట్ల నిధులను మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. అర్హులైన 408 మందికి ఇళ్ల తాళాలు అందజేసి, మిగిలిన 36 ఇళ్లను రెండో విడతలో ఇస్తామని ప్రకటించారు. అయితే, కాంట్రాక్టర్ల బిల్లుల సమస్యతో పనులు ఆగిపోవడంతో లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. కొన్ని బ్లాక్‌లలో మాత్రమే పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేయించారు. మిగిలిన ఇళ్లలోనూ వసతులు కల్పించి, మిగతా లబ్ధిదారులందరికీ గృహప్రవేశం కల్పించాలి.

– కొత్త సత్యనారాయణ, డబుల్‌ బెడ్‌రూమ్‌

ఇళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి

ఫ అసంపూర్తిగా డబుల్‌

బెడ్‌రూమ్‌ ఇళ్లు

ఫ 324 ఇళ్లలో సమకూరని వసతులు

ఫ నిరీక్షణలో మిగతా లబ్ధిదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement