సూర్యాపేట(సూర్యాపేటటౌన్) : రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం టేకుమట్ల కొత్త వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం తోటపల్లి గ్రామానికి చెందిన గానుబోయిన రవితేజ(32) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లో సరుకు లోడ్ చేసుకుని కాకినాడకు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున టేకుమట్ల ఫ్‌లైఓవర్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రవితేజ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రవితేజను క్యాబిన్ నుంచి బయటకు తీసి అంబులెన్స్‌లో సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు గానుబోయిన రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
వ్యవసాయ మోటార్లు చోరీ
మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని గుండాల–మోత్కూరు మధ్య రోడ్డులో బిక్కేరు వాగు ఆయకట్టుకు చెందిన రైతులు బుర్ర లచ్చయ్య, ఆమనగంటి వెంకట్‌రెడ్డి, బుర్ర రామచంద్రు, బోయిని లచ్చయ్య, దూదిమెట్ల బయ్యాలు, కల్వల యోగానందరావు వ్యవసాయ మోటార్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయి. మంగళవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులకు మోటార్లు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. గతంలోనూ పలుమార్లు బిక్కేరు వాగు సమీపంలో రైతులకు చెందిన మోటార్ల కేబుల్ వైర్లను దుండగులు ఎత్తుకెళ్లారని, ఇప్పుడు ఏకంగా మోటార్లనే అపహరించారని బాధిత రైతులు వాపోయారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొంపల్లి సతీష్‌కుమార్ తెలిపారు.


