నట్టల నివారణతోనే దూడలకు ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

నట్టల నివారణతోనే దూడలకు ఆరోగ్యం

Nov 14 2026 7:57 AM | Updated on Nov 14 2026 7:57 AM

ముఖ్యమైన జాగ్రత్తలు

ఫ నేటి నుంచి దూడలకు

నట్టల నివారణ టీకాల పంపిణీ

ఫ 11వ తేదీ వరకు

కొనసాగనున్న కార్యక్రమం

పెద్దవూర: పశువుల పెంపకంలో దూడల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యల్లో నట్టల (నులి పురుగులు) వ్యాధి ఒకటి. ముఖ్యంగా ఆరు నెలల వయస్సు వరకు ఉన్న దూడలలో నట్టల సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. నట్టల వల్ల దూడల ఎదుగుదల తగ్గడం, రక్తహీనత, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. సరైన సమయంలో నట్టల నివారణ చర్యలు చేపడితే దూడలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చునని పెద్దవూర మండల పశువైద్యాధికారి నులక నాగార్జున్‌రెడ్డి తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు గ్రామాలలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గేదె దూడలకు ఉచితంగా నులిపురుగుల నివారణ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.

నట్టలు అంటే..?

పశువుల జీర్ణవ్యవస్థ, పేగులు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాల్లో నివసిస్తూ పశువుల శరీరంలోని పోషకాలను వినియోగించుకునే పరాన్నజీవులను నట్టలు అంటారు. నట్టలు ప్రధానంగా గుండ్రని నట్టలు, బద్దె నట్టలు, కొరుకు నట్టలు, ఊపిరితిత్తుల నట్టలు, కాలేయ నట్టలు అనే రకాలుగా ఉంటాయి. వీటిలో గుండ్రని నట్టలు చిన్న వయస్సు దూడల్లో ఎక్కువ సమస్యలను కలిగిస్తాయి.

దూడలకు నట్టలు ఎలా సోకుతాయి

దూడలకు వివిధ మార్గాల ద్వారా నట్టలు వ్యాపిస్తాయి. కొన్నిరకాల నట్టలు తల్లి పశువు నుంచి దూడకు వ్యాపిస్తాయి. ముఖ్యంగా టాక్సోకారా విటులోరం అనే నట్టలు తల్లి పాలు ద్వారా దూడలకు సోకవచ్చు. నట్టల గుడ్లు ఉన్న పచ్చిమేతను తినడం వలన. కలుషితమైన నేలపై పెరిగిన గడ్డిని మేయడం వలన వ్యాపిస్తుంది. నట్టల గుడ్లు లేదా లార్వా ఉన్న నీటిని తాగడం వల్ల కొన్ని పరాన్నజీవులు సోకుతాయి. నట్టలు సోకిన పశువుల పేడలో నట్టల గుడ్లు బయటకు వస్తాయి. అవి నేల, మేత, నీటిని కలుషితం చేస్తాయి.ఆరోగ్యంగా ఉన్న దూడలు ఈ గుడ్లు లేదా లార్వాలను తీసుకోవడం ద్వారా వ్యాధికి గురవుతాయి. తడిగా, మురికిగా ఉన్న నేలపై దూడలు తిరగడం, పేడ, మూత్రం పేరుకుపోవడం, అపరిశుభ్రమైన మేత పాత్రలు, నీటి తొట్టెలు ఉపయోగించడం వలన వ్యాధి సోకుతుంది.

దూడల్లో నట్టలు ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు

తెల్లటి లేదా నల్లటి దుర్వాసనతో కూడిన విరేచనాలు, దూడ సరిగా మేత తినకపోవడం, ఎంత ఆహారం తిన్నా శరీర బరువు పెరగకపోవడం, కడుపు ఉబ్బినట్లు కనిపించడం, తరచుగా విరేచనాలు కావడం, వెంట్రుకలు నిస్తేజంగా, రఫ్‌గా మారడం, శరీరం బలహీనంగా ఉండటం, రక్తహీనత ఏర్పడటం, కళ్ల లోపలి పొరలు పాలిపోయినట్లు కనిపించడం, ఎదుగుదల మందగించడం, కొన్ని సందర్భాల్లో పేడలో నట్టలు కనిపించడం వంటివి ఉంటాయి.

నట్టలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు

● పశువుల కొట్టాలలో ప్రతిరోజూ పేడను తొలగించాలి. నేల తడిగా లేకుండా చూసుకోవాలి. పశువుల కొట్టాలకు సరైన గాలి, వెలుతురు ఉండాలి.

● దూడలకు శుభ్రమైన నీటిని అందించాలి. నీటి తొట్టెలను తరచూ శుభ్రం చేయాలి.

● పేడ కలిసిన గడ్డిని దూడలకు పెట్టకూడదు. పరిశుభ్రమైన పచ్చిమేతను అందించాలి. పచ్చిక బయళ్లను మారుస్తూ మేపాలి.

● పేడను ఎప్పటికప్పుడు తొలగించి, సరైన పద్ధతిలో కంపోస్టు చేయాలి. పేడను మేత, నీటి వనరులకు దూరంగా ఉంచాలి.

● తల్లి పశువులకు కూడా పశువైద్యుడి సలహా ప్రకారం నట్టల నివారణ చేయించాలి. ముఖ్యంగా ఈనడానికి ముందు ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలి.

● పశువైద్యుడి ద్వారా పేడ పరీక్ష చేయించాలి. నట్టల గుడ్లు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. అవసరమైన మందులను మాత్రమే ఉపయోగించాలి.

● దూడ పుట్టిన వెంటనే మురికిగా ఉన్న పరిసరాల్లో ఉంచకూడదు. మొదటి పాలు (ముర్రుపాలు) తప్పనిసరిగా తాగించాలి.

● దూడల బరువును క్రమం తప్పకుండా నమోదు చేయాలి.

● విరేచనాలు, తీవ్రమైన నీరసం, కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

దూడ వయస్సు, బరువు ఆధారంగా మందును ఎంపిక చేయాలి. అన్ని మందులు అన్ని రకాల నట్టలపై పనిచేయవు. ఒకే మందును పదేపదే ఉపయోగించడం వల్ల మందుల నిరోధకత ఏర్పడవచ్చు. అనారోగ్యంతో ఉన్న దూడలకు పశువైద్యుని సలహా లేకుండా మందులు ఇవ్వకూడదు. మందుల మోతాదు, వాడే విధానం పశువైద్యుని ద్వారా నిర్ధారించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement