ఎక్స్‌ప్లోజివ్‌ పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్లోజివ్‌ పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు

Nov 14 2026 7:57 AM | Updated on Nov 14 2026 7:57 AM

చిట్యాల, నార్కట్‌పల్లి : పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలు కార్మికుల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల పరిధిలోని పలు ఎక్స్‌ప్లోజివ్‌ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు లోపించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పెసో(పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌) నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఈ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో 8 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా రియాక్టర్లు, నిల్వ కేంద్రాలు, ప్యాకింగ్‌, ఉత్పత్తి విభాగాల్లోనే ఈ పేలుళ్లు సంభవిస్తున్నాయి. మంగళవారం కూడా నార్కట్‌పల్లి గోపలాయపల్లిలోని ఐడీయల్‌ డిటోనేటర్స్‌ పరిశ్రమలో జరిగిన పేలుడులో నలుగురు కార్మికులు గాయపడ్డారు.

గతంలో జరిగిన ప్రమాదాలివే..

ఫ 2006 జూలై 18న చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని అంజనా ఎక్స్‌ప్లోజివ్‌ పరిశ్రమలో పేలుడు జరిగి ఐదుగురు మృతిచెందారు.

ఫ 2013 డిసెంబర్‌ 8న చిట్యాల పరిధిలోని ఐడీయల్‌ ఇండస్ట్రియల్‌ ఎక్స్‌ప్లోజివ్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి ఇద్దరు మరణించారు. ఇదే పరిశ్రమంలో 2019 ఫిబ్రవరి 21న జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.

ఫ 2017 నవంబర్‌ 20న నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లిలోని ఐడీయల్‌ డిటోనేటర్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇదే పరిశ్రమలో 2014 డిసెంబర్‌ 11న జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.

కారణాలివే..

డిటోనేటర్ల తయారీలో అమ్మోనియం నైట్రేట్‌, హెచ్‌ఎంఎక్స్‌, పీఈటీఎన్‌ లాంటి ప్రమాదకర రసాయనాలు వాడతారు. వీటిని నిర్ణీత ఉష్ణోగ్రతలో రియాక్షన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, అధిక వేడి, కెమికల్స్‌ లీకేజీ, ఒత్తిడి వల్ల రియాక్టర్లు పేలుతున్నాయి. అల్యూమినియం పౌడర్‌కు మంటలు అంటుకోవడం, నిల్వ కేంద్రాల్లోకి నీరు చేరడంతో పాటు డిటోనేటర్లను ప్యాకింగ్‌ చేసే సమయంలో, పనికిరాని డిటోనేటర్లను తరలించే క్రమంలో ఈ పేలుడు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తనిఖీలు ఏవీ?

కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే మారింది. పెసో, పరిశ్రమల శాఖ అధికారులు నిరంతరం ఈ పరిశ్రమల్లో తనిఖీలు చేయాలి. యాజమాన్యాలకు, కార్మికులకు కఠినమైన భద్రతా సూచనలు జారీ చేసి వాటిని అమలయ్యేలా చూస్తేనే ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు.

ఫ చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల పరిధిలోని పరిశ్రమల్లో ఇప్పటివరకు 8 మంది కార్మికుల మృతి

ఫ మరికొందరికి గాయాలు

ఫ లోపించిన భద్రతా ప్రమాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement