నిమజ్జన ప్రాంతాలు ఇవే..
భువనగిరి: తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథులు బుధవారం గంగమ్మ ఒడికి చేరనున్నారు. వినాయక నవరాత్రోత్సవాలు మంగళవారంతో ముగియడంతో 23న జిల్లా వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో, తగినంత నీటి వసతి ఉన్న చెరువులను మాత్రమే నిమజ్జనం కోసం ఎంపిక చేశారు. మున్సిపల్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సిద్ధంగా గజ ఈతగాళ్లు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,964 మండపాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలోనే 200లకు పైగా విగ్రహాలు కొలువుదీరాయి. చెరువుల వద్ద భారీ బారికేడ్లతో పాటు క్రేన్లు, విద్యుత్, తాగునీరు, బోట్లు, లైటింగ్ తదితర సదుపాయాలు కల్పించారు. అగ్నిమాపక, ఆరోగ్య, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు భువనగిరి పెద్ద చెరువు వద్ద 15 మంది, రాయగిరి చెరువు వద్ద 5 గురు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. శోభాయాత్ర మార్గాల్లో విద్యుత్ వైర్లు తగలకుండా హై రైజింగ్ చేయడంతో పాటు, చెట్ల కొమ్మలను తొలిగించారు.
శోభాయాత్ర వెళ్లేది ఇలా..
భువనగిరి పట్టణంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, కూడళ్లలో కాషాయ తోరణాలు, స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్, హనుమాన్ వాడ, సంజీవనగర్, గంజ్ ఏరియా నుంచి వచ్చే విగ్రహాలు నేరుగా ప్రిన్స్ చౌరస్తా మీదుగా చెరువు వైపు వెళ్తాయి. శ్రీరామ్ తండా చౌరస్తా, జంఖానగూడెం, ఇందిరానగర్, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు శంకర్ విలాస్, సమ్మద్ చౌరస్తాల మీదుగా ప్రిన్స్ చౌరస్తాకు చేరుకుని అక్కడినుంచి చెరువుకు వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. భువనగిరితో పాటు చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్ తదితర ప్రాంతాల్లో కూడా నిమజ్జనానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు.
పటిష్టమైన పోలీస్ బందోబస్తు
నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గంలో సీసీ కెమెరాల నిఘా ఉంచారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతో పాటు సుమారు 500 మంది ట్రాఫిక్ పోలీస్, సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ, ఉమెన్స్ టీమ్ రంగంలోకి దిగాయి. నిర్వాహకులు డీజేలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
నేడు విద్యా సంస్థలకు సెలవు..
జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో భిక్షపతి, డీఐఈఓ సురేష్‌రెడ్డి వెల్లడించారు. దీనికి బదులు వచ్చే రెండో శనివారం స్కూళ్లు, కాలేజీలు నడపాలని సూచించారు.
ఇప్పటికే 750 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. బుధవారం 2 వేల నుంచి 3 వేల వరకు విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉంది. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు పోలీసులకు సహకరించాలి.
– అక్షాంశ్ యాదవ్, ఎస్పీ
పెద్ద చెరువు వద్ద నిమజ్జనానికి వివిధ శాఖలు, మున్సిపాలిటీకి చెందిన 180 మంది సిబ్బందిని, 15 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాం. ఇక్కడ 7 క్రేన్లు, రాయగిరి చెరువు వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశాం.
–చంద్రప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి
ఫ జిల్లావ్యాప్తంగా శోభాయాత్రగా తరలనున్న 3,964 వినాయక విగ్రహాలు
ఫ నిమజ్జనం కోసం 14 ప్రదేశాల ఎంపిక
ఫ భారీ పోలీస్ బందోబస్తు.. డీజేలకు అనుమతి నిరాకరణ
భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు, బస్వాపురం చెరువు, రాయగిరి చెరువు, బీబీనగర్ పెద్ద చెరువు, చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు, మల్కాపురం, పోచంపల్లి చెరువు, రామన్నపేట మండలం తుమ్మలగూడెం చెరువు, వలిగొండ మండలం సంగెం గ్రామం వద్ద మూసీ కెనాల్, మోత్కూర్ చెరువు, యాదగిరిగుట్ట నల్ల చెరువు, గోధుమకుంట, ఆలేరు మండలంలోని సాయిగూడెం చెరువు, బాహుపేట పరిధిలో గోధుమకుంటలను అధికారులు ఎంపిక చేశారు.
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలి
భువనగిరి: ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. నిమజ్జన ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్‌రెడ్డి, డీఈ, సిబ్బంది ఉన్నారు.


