యాదగిరిగుట్ట క్షేత్రానికి రూ.12.41లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్ట క్షేత్రానికి రూ.12.41లక్షల విరాళం

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన ఆశయంగారి నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి సోదరులు రూ.12.41 లక్షల విరాళం అందజేశారు. మంగళవారం యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం వారు ఈఓ భవానీశంకర్‌ను కలిసి చెక్కులు ఇచ్చారు. కొండ కింద నిర్మించనున్న రెండవ కల్యాణ కట్టకు రూ.9లక్షలు, విష్ణు పుష్కరిణి వద్ద కోతుల బెడద నుంచి రక్షించేందుకు సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు రూ.3.41లక్షలు అందించారు. దాతలు యాదగిరి క్షేత్ర అభివృద్ధికి ముందుకు రావాలని ఈఓ కోరారు.

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

అడ్డగూడూరు: అడ్డగూడూరు మండలం ధర్మారంలో బుధవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి నీటిపారుదల, పౌరసరఫరా శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భువనగగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి రానున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేల్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ధర్మారంలో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌ను ప్రారంభించి, గ్రామ ఊరు చెరువు అభివృద్ధి పనులను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.

24గంటలు మద్యం దుకాణాలు బంద్‌

భువనగిరిటౌన్‌ : వినాయక నిమజ్జనోత్సవాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎ. భాస్కర్‌ రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:00 గంటల నుంచి ఈనెల 24వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు అన్ని మున్సిపాలిటీలు, వాటి సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల పరిధిలోని ఏ4 మద్యం దుకాణాలు, 2బీ బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలతో పాటు మద్యం విక్రయాలు, సరఫరా చేసే అన్ని కేంద్రాలు మూసిఉంచాలని ఆదేశించారు.

పోచంపల్లిని సందర్శించిన స్విట్జర్లాండ్‌ దేశస్తులు

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్‌ పరిశ్రమ తీరు తెన్నులను తెలుసుకోవడానికి స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన ముగ్గురు పర్యాటకులు పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కులో గల మగ్గాలను పరిశీలించారు. అక్కడ వస్త్ర తయారీ ప్రక్రియల ఫొటోగ్యాలరీని తిలకించారు. అనంతరం ఇక్కత్‌ వస్త్రాలు, డిజైన్లు, పోచంపల్లి సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాన్ని, చేనేత కళాకారుల నేత నైపుణ్యాలను అడిగితెలుసుకొని అభినందించారు.

దివ్యాంగ విద్యార్థుల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత

భువనగిరి: దివ్యాంగ విద్యార్థుల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత అని ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం రాయగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరానికి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, సమన్వయకర్త లింగారెడ్డి, ఎంఈఓ రంగరాజన్‌, హెచ్‌ఎం అండాలు, శివరాజు, షాజహాన్‌, నరేష్‌, జ్యోతి, సంధ్యారాణి, బాలరాజు, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌,సత్యం, సుజాత, షబానా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement