పారిశ్రామిక భవ్య కాంతి | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక భవ్య కాంతి

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు

సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక భవ్య పథకం కింద అభివృద్ధి చేయడానికి జిల్లాలోని దండుమల్కాపురం, ఎం. తుర్కపల్లి ఎంపికయ్యాయి. దీంతో జిల్లా రూపురేఖలు మారడమే కాకుండా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి.

తొలి ప్రాధాన్యతగా

దండుమల్కాపురం విస్తరణ

భూముల లభ్యత అనుకూలంగా ఉండటంతో చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురం విస్తరణకు అధికారులు తొలి ప్రాధాన్యమిచ్చారు. ఇప్పటికే ఇక్కడ 2019లో 1,850 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో మైక్రో, స్మాల్‌, మీడియం పరిశ్రమల కోసం 580 ఎకరాలు కేటాయించగా, 550 పరిశ్రమలకు భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అందులో 300కు పైగా పరిశ్రమలు ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయి. ఈ పార్క్‌కు అనుబంధంగా అందుబాటులో ఉన్న దాదాపు 450 ఎకరాలను కేంద్ర భవ్య పథకం కింద ప్రాసెస్‌ చేయడానికి టీజీఐఐసీ ఎంపిక చేసింది. ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్‌ రూపొందించి ఇప్పటికే కేంద్రానికి పంపారు. ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో అనుమతులతో పాటు కేంద్రం ప్రకటించే రాయితీలు కూడా ఖరారయ్యే అవకాశముంది.

రెండో విడతలో

తుర్కపల్లి ఇండస్ట్రియల్‌ పార్క్‌

భవ్య పథకం రెండో విడతలో భాగంగా ఎం. తుర్కపల్లి మండలంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు 150 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. దండుమల్కాపురం ప్రాజెక్టు పరిమాణంలో పెద్దది కావడంతో తొలి ప్రాధాన్యం ఇవ్వగా, ఎం. తుర్కపల్లిని రెండో ప్రాధాన్యత కింద వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అనుకూలత అంశాలు ఏమిటంటే..

దండుమల్కాపురం, తుర్కపల్లి ప్రాంతాలు హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉండటం అతిపెద్ద ప్లస్‌ పాయింట్‌. జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్‌, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అతి చేరువలో ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏరోస్పేస్‌, ఇంజనీరింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌, పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు రానున్నాయి.

ఫ కేంద్ర భవ్య పథకం కింద దండుమల్కాపురం, తుర్కపల్లి ఎంపిక

ఫ ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం

ఫ ఈవీ, ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు ప్రాధాన్యం

ఫ స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు

ఫ పారిశ్రామిక ప్రగతి దిశగా జిల్లా ముందడుగు

దండుమల్కాపురం, తుర్కపల్లి ఇండస్ట్రియల్‌ పార్క్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లా ఆర్థిక పరిస్థితి గణనీయంగా పుంజుకుంటుంది. పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూమి, మౌలిక వసతులు కల్పించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. రాబోయే రోజుల్లో ఈ పార్కుల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement