● భువనగిరి పట్టణంలోని 27వ వార్డుకు చెందిన నసీర్ కుమారుడు బషీర్ (2.5 సంవత్సరాలు) మంగళవారం ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసి గాయపరిచాయి. గాయాలపాలైన బాలుడిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.
● గత నెల 7న మున్సిపాలిటీలోని 25వ వార్డులో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు వడ్డేపల్లి అలివేలుపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
● ఆరు నెలల క్రితం తారకరామ నగర్‌కు చెందిన ప్రియాన్ష్ అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. దీంతో చిన్నారి కన్ను బయటికి వచ్చేసింది. దీంతో ఆ బాలుడు శాశ్వతంగా చూపు కోల్పోయాడు.
భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లోనూ పదుల సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ప్రజలు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. దీంతో జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు.
లక్షల నిధులు వృథా..
వీధి కుక్కల నియంత్రణకు, వాటికి కుటుంబ నియంత్రణ (ఏబీసీ) శస్త్రచికిత్సలు చేయడానికి మున్సిపాలిటీ ఖాతా నుంచి లక్షల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితాలు కన్పించడంలేదు.అధికారులు కుక్కలను పట్టుకెళ్లి ఆపరేషన్లు చేసి, మళ్లీ పట్టుకొచ్చిన ప్రాంతాల్లోనే వదిలేయడం వల్ల దాడుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్
భువనగిరి మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తమకు శాశ్వత విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ భువనగిరిలో తీవ్రమైన కుక్కల బెడద
ఫ తాజాగా చిన్నారిపై దాడి
ఫ గతంలో కుక్కల దాడిలో కన్ను కోల్పోయిన మరో చిన్నారి.. పారిశుద్ధ్య కార్మికురాలికి గాయాలు
ఫ శునకాల నియంత్రణకు రూ.లక్షలు వెచ్చిస్తున్నా కానరాని ఫలితం


