నిషేధిత జాబితాలోకి ఈడీ కేసు భూములు | - | Sakshi
Sakshi News home page

నిషేధిత జాబితాలోకి ఈడీ కేసు భూములు

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

ఫ తూప్రాన్‌ పేటలో 5.5 ఎకరాలు గుర్తింపు

సాక్షి, యాదాద్రి: చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేటలో 5.5 ఎకరాల ఈడీ కేసు భూమిని నిషేధిత జాబితాలో అధికారులు చేర్చారు. ‘ఈడీ, సిట్‌ కేసులు ఉన్నా ఆగని రిజిస్ట్రేషన్‌లు’ అనే శీర్షికన ఈనెల 19న జిల్లా పేజీలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించి విచారణ ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌, ఇన్‌కం టాక్స్‌డిపార్ట్‌ మెంట్‌లు తూప్రాన్‌ పేటలో 5. 5 ఎకరాల భూమిని 22 ఏ నిషేధిత జాబితాలో యథావిధిగా చేర్చారు. 13 ఇ,1లో 2.250 ఎకరాలు, 14.అ,1 లో2.200 ఎకరాలు ఇందులో ఉన్నాయి. కాగా ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చేయడానికి స్లాట్‌ బుక్‌ కాగా హోల్డ్‌లో పెట్టడంతో విషయం బయటపడింది. విషయం వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై భూములను ఈనెల 20న నిషేధిత జాబితాలో తిరిగి చేర్చారు. కాగా నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఎలా తొలగించారు, స్లాట్‌ఎలా బుక్‌ అయ్యింది అనే కోణంలో విచారణ జరుగుతోంది.

భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి

సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, అటవీ భూముల పరిహారం, సహాయ–పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజులతో కలిసి మంత్రి ఉత్తమ్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, అటవీ క్లియరెన్సులు, నిర్వాసితులకు పరిహారం పంపిణీపై చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకా రెడ్డి , రెవెన్యూ డివిజనల్‌ అధికారి కృష్ణా రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రవీందర్‌, భువనగిరి తహసీల్దార్‌ జగన్‌ మోహన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యం

వలిగొండ : నిమజ్జన కేంద్రాల వద్ద ప్రజల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ పేర్కొన్నారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని వలిగొండ మండల పరిధిలోని అక్కాచెల్లెళ్ల చెరువు, సంగెం చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఘాట్లను సోమవారం ఆయన పరిశీలించిమాట్లాడారు. గణేశ్‌ నిమజ్జన కార్యక్రమాలను అత్యంత ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనం సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చౌటుప్పల్‌ డీఎస్పీ మధుసూదన్‌ రెడ్డి, రామన్నపేట సీఐ రవి, ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీడీఓ జలంధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

గడువులోగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

సాక్షి, యాదాద్రి : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను 30 నుంచి 40 రోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సమీక్షలో కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావు, అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో 2,380 ప్రవేశాలే లక్ష్యం

భువనగిరి: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో 2026–27లో 2,380మంది ప్రవేశాలే లక్ష్యమని ఓపెన్‌స్కూల్‌ సొసైటీ రాష్ట్ర ఇన్‌చార్జి, విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ వెల్లడించారు. ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలపై సోమవారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌లో ఇప్పటి వరకు 26శాతం మంది ప్రవేశాలు పొందారని, మిగిలిన 74శాతం మంది అడ్మిషన్లు పొందేలా మహిళా సమాఖ్య ద్వారా కృషి చేయాలన్నారు. టాస్‌కు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, ఎంఈఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement