సాక్షి, యాదాద్రి : బీఆర్‌ఎస్ పార్టీలో నాయకుల మధ్య ఐక్యతకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీష్‌రావు రంగంలోకి దిగారు. ఆదివారం మోటకొండూరు మండల కేంద్రంలో జరిగిన సభ ద్వారా ఆయన ఈ ప్రయత్నాలు చేశారు. జిల్లాలోని సీనియర్ నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. కేవలం స్థానిక నాయకులే కాకుండా, ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. కొంతకాలంగా మాట్లాడుకోని నాయకులను.. ఒకరినొకరు కలుసుకునేలా చేశారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్యెల్యేలు కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, సీనియర్ నాయకులు బండా నరేందర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డిని ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. శ్రీమేమంతా ఒక్కట్ఙే అనే బలమైన సందేశాన్ని పార్టీ క్యాడర్‌లో కల్పించారు. పదవులు కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో మాజీ ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వాములను చేయడం విశేషం. నాయకుల మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పటికీ, బహిరంగంగా మాత్రం పార్టీ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం అనే భావనను కలిగించడంలో హరీష్‌రావు వ్యూహాత్మకంగా వ్యవరించారు. అందరిని ఒకే వేదికపైన కూర్చో బెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలంటే ముందుగా బీఆర్‌ఎస్‌లో ఐక్యత అవసరమని భావించిన ఆయన మోటకొండూరు వేదిక ద్వారా గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు.
ప్రజా సమస్యలపై దృష్టి
ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ క్యాడర్‌ను హరీష్‌రావు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఎదురవుతున్న విద్యుత్ కోతలపై ఆందోళనలు చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. రైతులకు రుణమాఫీ, ఎరువుల కొరత, 22–ఏ నిషేధిత భూముల వివాదాలు, రైతు భరోసా, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రజా ఉద్యమాలకు పిలుపునిచ్చారు. తమపై వ్యక్తిగతంగా జరుగుతున్న ఇతర ఆరోపణలను పక్కనపెట్టి, కేవలం ప్రజల నిత్య సమస్యల ఆధారంగానే ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే చేరికలకు శ్రీకారం చుట్టారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి స్వయంగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హరీష్‌రావు.. క్షేత్రస్థాయిలో పార్టీకి ఇంకా బలమైన మద్దతు ఉందని నిరూపించే ప్రయత్నం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత శ్రేణుల్లో నెలకొన్న నిరాశను, నాయకుల మధ్య విభేదాలను తొలగించడమే లక్ష్యంగా మోటకొండూరు సభ సాగింది. ఒకవైపు సొంత పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ, మరొకవైపు అధికార పార్టీ విధానాలపై సూటిగా విమర్శలు గుప్పించడంలో హరీష్ రావు తన మార్కును చూపించారు.
ఫ హరీష్‌రావు సభతో బీఆర్‌ఎస్ పార్టీకి కొత్త ఊపు
ఫ ప్రజా సమస్యలపై పోరుకు దిశానిర్దేశం
ఫ చేరికలతో క్యాడర్‌లో ఉత్సాహం


