బొమ్మలరామారం: ప్రాణదానంతో సమానమైన అవయవదానం చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. మాధవీలత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయ రాజు సూచనల మేరకు బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామ పంచా యతీ కార్యాలయం ఆవరణలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం అవయవదానంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ తిర్మణి నాగరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయ సహాయ న్యాయవాది నాగరాజు , ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం, ఎంపీఓ శశికళ, పంచాయతీ కార్యదర్శి మధు సూధన్ రెడ్డి, ఉప సర్పంచ్ జూపల్లి భూమయ్య, రాగుల బల్‌రామ్, పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహ హోమం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు.
నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కొండకు దిగువన ఉన్న శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వ్రతశాలలో పీటలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే పలువురు మహిళలు వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనేందుకు తమ పేర్లను వ్రత మండపంలోని కౌంటర్ వద్ద నమోదు చేసుకున్నారు. ఉదయం 11గంటల నుంచి సామూహిక వ్రతాలు నిర్వహించనున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకునే మహిళలకు దేవస్థానం తరఫున ఉచితంగా పూజా సామగ్రి అందజేయనున్నారు.


