యాదగిరిగుట్ట: పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరించొద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 97ను ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం యాదగిరిగుట్టలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బంద్ నిర్వహించిన అనంతరం పట్టణంలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటిని ముట్టడించారు.సుమారు 30 నిమిషాలకు పైగా ఐలయ్య ఇంటి ముందు విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బైఠాయించారు. డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు అక్కడికి చేరుకొని సమస్యను తెలుసుకొని, విప్ బీర్ల ఐలయ్యతో ఫోన్‌లో మాట్లాడించడంతో విద్యార్థులు నిరసనను విరమించుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సర్కారు విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబించడం బాధకరమన్నారు. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి జీఓ నంబర్ 97లో ఉన్న పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యకు స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కీలకమైన సంస్థ అని, దాని పాత్రను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఇందు రాణి, జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, జిల్లా కమిటీ సభ్యులు నేహాల్, ప్రసన్న, నాయకులు అరవింద్, జీవన్, అన్వేష్, అరుణ, చైతన్య, భాను, ప్రసన్న, పవన్, ధనుష్, మోహన్ పాల్గొన్నారు.


