భూదాన్‌పోచంపల్లి : అనారోగ్యం కారణంగా పెళ్లి కాదని మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం భూదాన్‌పోచంపలల్లి మండలం మామిళ్లగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం భట్టుగూడెం గ్రామానికి చెందిన కోరె నర్సింహకు నలుగురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు కోరె మధు (30) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మధు కొంతకాలంగా షుగర్(మధుమేహం) వ్యాధితో బాధపడుతూ రెండు పూటలా ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నాడు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఓ పెళ్లి సంబంధం కూడా రద్దు అయ్యింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి కాదని మనస్తాపం చెందిన మధు మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని అంబటి సుధాకర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం మృతుడి తండ్రి నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోచంపల్లి ఎస్‌ఐ జగన్ తెలిపారు.


