పాఠశాలలు, కళాశాలలే లక్ష్యం
పిల్లలను జాగ్రత్తగా గమనించాలి
సాక్షి, యాదాద్రి: జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలు, వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. సరదాగా ప్రారంభమయ్యే ఈ వ్యసనం విద్యార్థులు, యువతను తీవ్ర నేరాల వైపు నడిపిస్తోంది. ఇటీవల నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఇద్దరు విద్యార్థులు గంజాయి మత్తులో పాఠశాల ప్రిన్సిపాల్‌ను హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ మత్తు పదార్థాల ప్రభావం మైనర్ల ఆలోచనా విధానంపై ఎంతటి దుష్ప్రభావం చూపుతుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో జిల్లాలో గంజాయి విక్రయాలు, వినియోగంపై పోలీసులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
హాస్టళ్లలో దారుణ పరిస్థితులు
సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. సరైన కాంపౌండ్ వాల్స్ లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. రాత్రివేళల్లో గోడలు దూకి బయటకు వెళ్తున్న విద్యార్థులు.. మద్యం, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. చిన్నచిన్న గొడవలు కాస్తా తీవ్ర ఘర్షణలకు, చివరికి నేరాలకు దారితీస్తున్న ఉదంతాలు కలవరపెడుతున్నాయి. జిల్లాలోని ఓ వసతి గృహంలో ఇటీవల మత్తులో ఉన్న విద్యార్థి తోటి విద్యార్థిపై లైంగికదాడి చేశాడు.
కౌన్సెలింగ్ కోసం డీ అడిక్షన్ సెంటర్
ఈ సమస్యను గుర్తించిన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గంజాయి సరఫరా చేసే ముఠాలపై నిరంతరం దాడులు చేస్తూ కేసు నమోదు చేస్తున్నారు. పట్టుబడిన విద్యార్థులకు, యువతకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తూ పునరావాసం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ‘యాంటీ డ్రగ్ క్లబ్‌లు’ ఏర్పాటు చేసి మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో గంజాయి, మద్యం వ్యసనాలకు బానిసలైన వారికి జిల్లాలోని డీఅడిక్షన్ సెంటర్ లో కౌన్సిలింగ్, వైద్యం అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలు లభించే, వినియోగించే 22 హాట్ స్పాట్‌లను గుర్తించారు. ఈ అడిక్షన్ సెంటర్‌లో 110 మంది ఇన్‌పేషెంట్‌లకు, 137 ఔట్ పెషెంట్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పటికే 62 అవేర్‌నెస్ కార్యక్రమాలు, 32 కమ్యూనిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన ఒక మైనర్ బాలిక ఇంట్లో చెప్పకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ మండలానికి చేరింది. కొందరి సమాచారంతో ఆమెను జిల్లా అధికారులు చేరదీసి కౌన్సిలింగ్ ఇచ్చారు. మొదట తనకెవరు లేరని తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినప్పటికీ.. బాలిక మత్తు పదార్థాలకు బానిసవ్వడమే కాకుండా, పెద్ద ముఠా నెట్‌వర్క్‌లో చిక్కుకుందని, ధూమపానం, మత్తు పదార్థాలు వాడుతోందని విచారణలో తేలింది. సదరు బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి, ఈ మత్తు పదార్థాల నెట్‌వర్క్‌పై చర్యల కోసం ఎకై ్సజ్, పోలీస్ శాఖలకు అధికారికంగా సమాచారం ఇచ్చారు.
ఫ విద్యార్థులను
కబలిస్తున్న డ్రగ్స్ భూతం
ఫ జిల్లాలో ఆందోళనకరంగా మత్తు పదార్థాల వినియోగం
ఫ చోరీలు, దాడులకు పాల్పడుతున్న యువత
ఫ ముందుగా గుర్తిస్తేనే మేలంటున్న వైద్యులు
జిల్లాలోని పలు ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్, జూనియర్ కళాశాలల పరిసరాలు మత్తు ముఠాలకు అడ్డాగా మారుతున్నాయి. కాలేజీల సమీపంలోని పాన్‌షాపులు, టీ కొట్లు, నిర్మానుష్య ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని గంజాయి, మత్తు మాత్రలు సరఫరా చేస్తున్నారు. మొదట ఉచితంగా లేదా తక్కువ ధరకు అలవాటు చేసి, ఆపై డబ్బుల కోసం అదే యువతను ఏజెంట్లుగా మారుస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరిహద్దు జిల్లాల నుంచి రహస్యంగా జిల్లాలోకి ఈ మత్తు పదార్థాలు ప్రవేశిస్తున్నాయి.
గంజాయి తాగిన వ్యక్తికి దాదాపు 15 రోజుల వరకు దాని అవశేషాలు కనిపిస్తాయి. ఇటీవల పోలీస్, ఈగల్ టీమ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని కౌన్సిలింగ్, పునరావాసం కోసం ‘డీ–అడిక్షన్’ సెంటర్లకు పంపించాం. తల్లిదండ్రులు పిల్లల వద్ద పరిమితికి మించి డబ్బులు ఉంచొద్దు. రాత్రిపూట ఆలస్యంగా రావడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, కోపం పెరగడం వంటివి గమనిస్తే తక్షణమే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
– డాక్టర్ ప్రీతి స్వరూప్,
సైకియాట్రిస్ట్, యాదాద్రి భువనగిరి


