భువనగిరి: స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి సమన్వయ సమావేశం గురువారం నిర్వహించనున్నట్లు ఎస్‌జీహెఫ్ జిల్లా సెక్రటరీ దశరథరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు, సంబంధిత క్రీడాధికారులు హాజరుకావాలని కోరారు.
ఖాళీ పోస్టుల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ సారధిని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో 8 ప్రొఫెసర్ పోస్టులు, 12 అసోసియేట్ ప్రొఫెసర్, 17 అసిస్టెంట్ ప్రొఫెసర్, 1 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు, ధ్రువపత్రాలతో ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల లోపు ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
భూదాన్‌పోచంపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులు, రెగ్యులర్ ఎంఈఓ, డీఈఓల నియామకం, పండిట్, ఎస్‌జీటీ, పీఈటీలకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించడం తదితర సమస్యలను త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆ సంఘం మండల అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఇటికాల మణిపాల్‌రెడ్డి, రెగెట్టె రాజిరెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు కృష్ణయ్య, శ్రీదేవి, బోయ శ్రీనివాస్, నవీన్, పీఆర్‌టీయూ రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పర్యటనకు కౌన్సిలర్ల డుమ్మా
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు డుమ్మా కొట్టారు. బుధవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనకు మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు కుర్మిళ్ల ప్రమీల, మొగుళ్ల అనురాధ, కారుపోతుల వెంకన్న గౌడ్, గనగాని శైలజ, బీసు శ్రీకాంత్ గౌడ్, మెంట రమణ నగేష్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎమ్మెల్యే అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయి మున్సిపాలిటీలో వర్గ విభేదాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి ఫొటోను ఎమ్మెల్యే పర్యటన ఫ్లెక్సీలో ముద్రించకపోవడంపై అసంతృప్తితోనే తాము ఎమ్మెల్యే కార్యక్రమాలకు హాజరు కాలేదని కౌన్సిలర్లు విలేకరులకు తెలిపారు. పార్టీలో సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పర్యటనకు దూరంగా ఉన్నట్లు వారు స్పష్టం చేశారు. మెజార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పర్యటనకు గైర్హాజరు కావడంపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
క్రీడల అభివృద్ధి అధికారిగా ధనుంజనేయులు
భువనగిరి: జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారిగా ధనుంజనేయులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లా యువజన క్రీడల ఇన్‌చార్జి అధికారిగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్యామ్‌సుందర్ పనిచేశారు. ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ధనుంజనేయులు పదోన్నతిపై బదిలీ ద్వారా ఇక్కడికి వచ్చారు.


