బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి
● ఎయిమ్స్ సమీపం నుంచి కొండమడుగు వద్ద ఉన్న కేపాల్ పరిసరాల వరకు వాహనాలు ఒకే వరుసలో బారులుదీరుతున్నాయి.
● ప్రైవేట్ కళాశాల దాటిన తర్వాత హెచ్‌పీ పెట్రోల్ బంక్ ప్రాంతం, వందన హోటల్ పరిసరాల్లో కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభిస్తోంది.
● ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్, అన్నోజిగూడ వద్ద ఘట్కేసర్ నుంచి నారపల్లి వైపు వెళ్లే మార్గంలోనూ నిత్యం ఇదే తంతు
కొనసాగుతోంది.
సాక్షి, యాదాద్రి : వరంగల్ – హైదరాబాద్ హైవేపై భువనగిరి నుంచి ఉప్పల్ వరకు ప్రయాణం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత రద్దీగా ఉండే ఈమార్గంలో చేపట్టిన రోడ్డువిస్తరణ పనులు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. బీబీనగర్ ఎయిమ్స్ నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ వరకు అరగంటలో ముగియాల్సిన ప్రయాణం.. గంటన్నరకు పైగా పడుతుండడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గంటల కొద్దీ నిరీక్షణ
ప్రధాన రహదారిపై పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్‌ను సర్వీస్ రోడ్లకు మళ్లించారు. ఈ సర్వీస్ రోడ్లపై గరిష్టంగా 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని నిబంధన ఉన్నా, రోడ్లు అత్యంత ఇరుకుగా ఉండటంతో ఒక వాహనం వెనుక మరొక వాహనం నత్తనడకన సాగాల్సి వస్తోంది. ఒక లారీ లేదా బస్సు వస్తే వెనుక ఉన్న వాహనాలన్నీ నిలిచిపోవాల్సిందే. ఈ సమస్య శని, ఆదివారాల్లో మరింత తీవ్రమవుతోంది. ఉద్యోగుల రాకపోకలతో పాటు వరంగల్, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, ఎల్లమ్మ దేవాలయాలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే లక్షలాది వాహనాలతో ఈ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభిస్తోంది.
ప్రమాదాలకు నిలయంగా మారిన మార్గం
వేగ నియంత్రణకు కాంట్రాక్టర్లు వేసిన అసంపూర్తి స్పీడ్ బ్రేకర్లు, అకస్మాత్తుగా ఎదురయ్యే గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొత్తగా వచ్చే వాహనదారులు వీటిని చూసి సడన్ బ్రేక్ వేస్తుండటంతో, వెనుక వస్తున్న వాహనాలు బలంగా ఢీకొంటున్నాయి. అవుషాపూర్, ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఇలాంటి ప్రమాదాలతో కార్ల బంపర్లు ధ్వంసమై అనేక మంది గాయపడుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
భద్రతా ప్రమాణాలు శూన్యం
రాత్రి వేళల్లో పనులు జరిగే ప్రాంతాల్లో కనీస భద్రతా చర్యలు లేవు. హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టర్లు ఎక్కడా సరిగా కనిపించడం లేదు. ఎయిమ్స్ సమీపంలో తవ్విన గుంతల వద్ద కనీసం రెడ్ టేప్ లేదా రక్షణ వైర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు ప్రమాదవశాత్తు పడిపోయే ముప్పు పొంచి ఉంది. ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల జంక్షన్ల వద్ద హోటళ్లు, టీ కొట్లు, మద్యం దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాల ముందు వాహనాలను రోడ్డుపైనే నిలుపుతుండటంతో రోడ్లు మరింత కుచించుకుపోతున్నాయి.
ఫ రోడ్డు విస్తరణ, అండర్‌పాస్ నిర్మాణాలతో వాహనాలను సర్వీస్ రోడ్లకు మళ్లింపు
ఫ భారీ వాహనం వస్తే వెనక ఉన్న
వాహనాలు నిలిచిపోవాల్సిందే
ఫ శని, ఆదివారాల్లో సమస్య మరింత తీవ్రం
కొండమడుగు, ఔషపూర్ దగ్గర నిర్మిస్తున్న అండర్ ప్లస్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి. జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనాలు దూసుకురావడంతో భయంతో కింద పడిపోతున్నారు. దీంతోపాటు సర్వీస్ రోడ్డు కావడంతో దుమ్ము ధూళి సైతం కళ్లలో పడి రోడ్డు కనిపించకుండా పోతుంది.
– అమీర్, భువనగిరి


