సాక్షి,యాదాద్రి : ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షలను ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాలు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు సాధించేందుకు ఆగస్టు 15 నాటికి మౌలిక వసతులు, పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాల నమోదులో ప్రతిభ కనబరిచిన వలిగొండ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి సూర్యశ్రీ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పర్యవేక్షకులు విజయసారధి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు
రాజాపేట : విద్యార్థుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. గుడ్లు, చికెన్ క్రమంతప్పకుండా అందించడం లేదని తెలుసుకుని కాంట్రాక్టర్‌తో మాట్లాడి మెనూ ప్రకారం అందేలా చూడాలని ప్రిన్సిపాల్ సుధాకర్‌కు సూచించారు. అన్ని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ ఇచ్చేందుకుగాను ఉపాధ్యాయుడు రాజును నియమిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట సర్పంచ్ కోయ మధు, పీఆర్ ఎస్‌ఈ విష్ణువర్ధన్, డీఈ శ్రీరామ్, తహసీల్దార్ రవికిరణ్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


