రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ లలిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు, రెండు జీరాక్స్‌ సెట్లతో హాజరుకావాలని తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామీణ మహిళలకు చేయూత

భువనగిరిటౌన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న చిన్న తరహా వ్యాపారాలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘తెలంగాణ సెర్ప్‌ ఇంక్యుబేటర్‌’ కార్యక్రమం దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో దీన్‌ దయాళ్‌ అంత్యోదయ యోజన – నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ (డే–ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఓరియంటేషన్‌ అండ్‌ ప్లానింగ్‌ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే నడుస్తున్న వ్యక్తిగత వ్యాపారాల్లో రూ.12 లక్షల టర్నోవర్‌, గ్రూప్‌ వ్యాపారాల్లో రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు టర్నోవర్‌ కలిగిన ఎంటర్‌ప్రైజెస్‌ను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం మండల స్థాయిలో గ్రామ సంఘాల ప్రతినిధులు, విఓఏలకు ఒక రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ జంగారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి పల్లవి, కోశాధికారి కే. అలివేలు, డీపీఎం రవీందర్‌, ఏపీఎం కే. సైదులు, టి–శాట్‌ ప్రతినిధి మణికంఠ పాల్గొన్నారు.

రిజర్వేషన్‌తో మహిళలకు సమాన అవకాశాలు

ఆలేరు : మహిళలకు రాజకీయ, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలంటే 33శాతం రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సృజన డిమాండ్‌ చేశారు. బుధవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన జిల్లా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ మహాసభలో ఆమె మాట్లాడారు. మహిళల రక్షణకు సంబంధించిన సమగ్ర చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి మహిళకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, సామాజిక భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అంతకుముందు మహిళలు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, చెడి చంద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్‌, రాజు, కనకయ్య పాల్గొన్నారు.

జిల్లా నూతన కమిటీ ఎన్నిక

సమావేశంలో సమాఖ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షురాలుగా గుర్రం రాజమణి, అధ్యక్షురాలుగా సోమన సబిత, ప్రధాన కార్యదర్శిగా బండి జంగమ్మ, ఉపాధ్యక్షురాలుగా మంచాల రాజమ్మ, మాటూరు జానమ్మ, సహాయ కార్యదర్శిగా కునుకుంట్ల నర్సమ్మ ఎన్నియ్యారు.

నేడు భువనగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

భువనగిరిటౌన్‌ : భువనగిరి మున్సిపాల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని గురువారం మున్సిపల్‌ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ అధ్యక్షతన నిర్వహించనున్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు 35 వార్డుల్లో ఫాగింగ్‌, స్ప్రేయింగ్‌ మిషన్ల మరమ్మతులకు నిధులు కేటాయించనున్నారు.

17 నుంచి వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు

భువనగిరి: చౌటుప్పల్‌లోని మల్కాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫిట్‌నెస్‌ స్టేషన్‌ వద్ద ఈ నెల 17 నుంచి జిల్లాలోని అన్ని రకాల వాణిజ్య వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి నరేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాల సామర్థ్య పరీక్షలకు వాహనదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement