ప్రస్తుతం నాలుగు నెలల అద్దె నిధులు రావాల్సి ఉంది. ప్రభుత్వం మంజూరు చేయగానే వెంటనే వారీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన కేంద్రాలు త్వరగా పూర్తియ్యేలా చర్యలు చేపడుతున్నాం.
– శ్రీనివాస్, ఇన్‌చార్జి జిల్లా సంక్షేమ అధికారి
ఫ మొత్తం 901 అంగన్‌వాడీ కేంద్రాలు
ఫ అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి 534
ఫ కనీస వసతులు లేక చిన్నారుల అవస్థలు
ఆలేరురూరల్: ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల దుస్థితి మారడం లేదు. పక్కా భవనాలు నిర్మిస్తామన్న పాలకుల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లావ్యాప్తంగా సగానికి పైగా అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవనాలు లేక, అరకొర వసతుల మధ్య అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పాత భవనాలు శిథిలావస్థకు చేరుకోగా, కొత్త భవనాల నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. ఫలితంగా ఇరుకు గదుల్లోనే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
534 అద్దె భవనాలు
జిల్లాలో ఆలేరు, భువనగిరి, మోత్కూర్, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వాటి పరిధిలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 46,679 మంది చిన్నారులున్నారు. ఇందులో 367 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా 534 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలు 295 ఉన్నాయి. మిషన్ భగీరథ నీటి సౌకర్యం లేని అంగన్‌వాడీ కేంద్రాలు 196 ఉన్నాయి. ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నడపడం వల్ల చిన్నారులు కూర్చోవడానికి, ఆట వస్తువులు ఉంచడానికి, పౌష్టికాహారాన్ని నిల్వ చేయడానికి స్థలం చాలక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గాలి, వెలుతురు రాక చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం, ఒకవేళ ఉన్నా నిర్వహణ లేకపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో కేంద్రాల్లో తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలంటే అంగన్‌వాడీ టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాలుగు నెలలుగా అందని అద్దె
సొంత భవనాలు లేని చోట అద్దె కేంద్రాల్లో కొనసాగుతున్న సిబ్బందికి కష్టాలు తప్పడం లేదు. గడిచిన నాలుగు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం నుంచి అద్దె చెల్లించలేదు. దీంతో భవన యజమానులు అద్దె కోసం ఒత్తిడి తెస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానుల ఒత్తిడి తట్టుకోలేక కొందరు టీచర్లు తమ వేతనాల్లోంచి అద్దెలు చెల్లిస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు లేనివారు యజమానులను బతిమాలుకుంటూ నెట్టుకొస్తున్నారు.
ముందుకురాని కాంట్రాక్టర్లు
గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు రూ.1,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,000 నుంచి రూ.4,000 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈ తక్కువ అద్దెకు ఇళ్లు ఇచ్చేందుకు యజమానులు ముందుకు రాకపోవడంతో ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నడుపుతున్నారు. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలకు 2018లో ప్రభుత్వం ఒక్కో భవనానికి రూ.8 లక్షల చొప్పున మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. ఉపాధిహామీ తదితర నిధులతో నాలుగైదేళ్ల కిందట ప్రారంభమైన పనులు ఇంకా పూర్తి కాలేదు.


