భువనగిరిటౌన్ : రేషన్ కార్డుల ఈ–కేవైసీ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఈ–కేవైసీ చేసే సమయంలో వేలిముద్రలు (ఫింగర్ ప్రింట్స్) రాకపోవడంతో అప్‌డేట్ కోసం తల్లిదండ్రులు వారిని తీసుకొని ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఆధార్ కేంద్రానికి తమ పిల్లలను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు అప్‌డేట్ కోసం గంటల తరబడి బారులు దీరారు. రేషన్ దుకాణాల్లో ఈ కేవైసీ నమోదు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార్ కేంద్రాలకు రావాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


