సాక్షి, యాదాద్రి: రైతులకు అప్పడే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పోగా ఉన్న కొద్దిపాటి నీటితో పంటలు సాగు చేసుకుందామంటే కరెంటు కోతలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వేళల్లో అధికారులు మార్పులు చేశారు. వారం రోజులుగా రాత్రి వేళల్లో త్రీ–ఫేజ్ కరెంట్‌ను పూర్తిగా నిలిపివేసి.. పగటిపూట మాత్రమే ఇస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో లోటు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.దీంతో బోర్లు, బావులపై ఆధారపడి వేసిన వరి నారుమళ్లు, నాట్లువేసిన పొలాలు నీరందక బీటలు వారుతున్నాయి. దీంతో రైతులు కరెంట్ కోసం సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు.
గత ఏడాదితో పోల్చితే తగ్గిన వరిసాగు
ఈ వానాకాలంలో జిల్లాలో 2,94,255 ఎకరాల్లో వరిసాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 1,09,934 ఎకరాల్లో వరిసాగు అయ్యింది. ఇందులో మూసీ మండలాలైన బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేటలో 57561 ఎకరాలు, సెమీ మూసీ మండలాలైన భువనగిరి, అడ్డగూడూరు, చౌటుప్పల్ మండలాల్లో16,680 ఎకరాలు, నాన్ మూసీ ఆయకట్టులో 35693 ఎకరాల్లో వరిసాగు అయ్యింది. గత సంవత్సరం ఇదే సమయానికి జిల్లాలో 2.23 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. అంటే దాదాపు లక్ష ఎకరాల్లో వరి సాగు తగ్గింది.
ఎండిపోతున్న వరిపొలాలు
ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. నాన్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, వ్యవసాయ బావుల కింద విద్యుత్ మోటార్ల ద్వారా వరిసాగు చేస్తున్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాను రాత్రి పూట నిలిపివేసింది. ఉదయం 5:15 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు మాత్రమే త్రీ–ఫేజ్ ఇస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు తాళ్ల ఉప్పల్ రెడ్డి .యాదగిరిగుట్ట కు చెందిన ఈ రైతు ఏడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. కొన్ని రోజుల నుంచి రాత్రి సమయంలో త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో రెండు ఎకరాల పొలానికి నీళ్లు సరిగ్గా అందక ఎండిపోతుంది. దీంతో ఈ ఎండిన పొలాన్ని కాపాడుకోవడానికి, నీళ్లను షిఫ్టింగ్ లాగా మార్చుకుంటున్నాడు.
ఆత్మకూర్‌ఎం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మక్తల నరసింహ 15 ఎకరాల వరకు సాగు చేసేవాడు. ప్రస్తుతం నీళ్లు , కరెంటు సక్రమంగా లేక మూడు ఎకరాల్లో వరి నాటు వేశాడు. త్రీఫేజ్ కరెంటు ఉదయం 5 గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు తీస్తున్నారు. అందులో మధ్యన కరెంటు బంద్ చేస్తున్నారు. అందులోనే ఎల్సీలు తీసుకుంటున్నారు. సుమారు రెండు గంటల పాటు విద్యుత్ అప్పుడప్పుడు తీసివేస్తున్నారు. దీంతో నాటువేసిన వరి చేను ఎండిపోయే దశకు చేరుకుంది.
ఫ ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు
ఫ ఉన్నకొద్దిపాటి నీటితో సాగు చేద్దామంటే కరెంటు కోతలు
ఫ బీటలువారుతున్న వరిపొలాలు


