యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం జరిపించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు పంచామృతాలతో నిజాభిషేకం, తులసీ దళాలతో సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజ చేపట్టారు. ఇక తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకులక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. శ్రీలక్ష్మీనృసింహ సహస్రనామార్చనతో వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజను అర్చకులు జరిపారు. పూలతో అలంకృతులైన శ్రీస్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకొని, సువర్ణ పుష్పార్చనపూజల్లో పాల్గొన్నారు. ఏకాదశి రోజున భగవంతుడిని దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం అని ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు తెలిపారు. తొలి ఏకాదశి వ్రతాన్ని చేపట్టిన భక్తులకు శ్రీస్వామి వారి అనుగ్రహం ఉంటుందన్నారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, భక్తులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


