ఒక్కో చుక్కను ఒడిసిపడదాం.. జలసిరితో జత కడదాం
రామన్నపేట: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న లోటు వర్షపాతాన్ని అధిగమించి, పొంచి ఉన్న కరువు ముప్పును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కురిసిన కొద్దిపాటి వర్షపు నీటినైనా వృథా చేయకుండా భూమిలోకి ఇంకించి, ఎండిపోతున్న బోరుబావులకు ప్రాణం పోయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నూరు శాతం సబ్సిడీతో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్‌లాంటి వాటిని నిర్మించి ఇవ్వనుంది. ఒక్కో చుక్కను ఒడిసి పడదాం.. జలసిరితో జత కడదాం అనే నినాదంతో రాబోయే మూడు నెలల్లో ఈ నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో..
జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా వీబీ జీ రామ్ జీ ( జాతీయ గ్రామీణ ఉపాధిహామీ )పథకం కింద ఆరు రకాల రిచార్జ్ నిర్మాణాలను నూరుశాతం సబ్సిడీపై అమలు చేయాలని ప్రతిపాదించారు . ఒక్కో గ్రామపంచాయతీ పరిధిలో కనీసం ఐదు పంటకుంటలు (ఫామ్ పాండ్స్), ఒక ఇంకుడు చెరువు(పర్కులేషన్ ట్యాంక్)ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవిగాక వ్యక్తిగత ఇంకుడు గుంతలు , సామూహిక ఇంకుడుగుంత, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, ఓపెన్‌బావులు నిర్మించాలన్నది లక్ష్యం.
చేపట్టే నిర్మాణాలు
ఏమిటంటే..
● వ్యక్తిగత ఇంకుడుగుంతలు(మ్యాజిక్ సోక్ పిట్)..
వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 6,600 చెల్లిస్తుంది. ఇళ్ల పైకప్పు, షెడ్ల నుంచి వచ్చే నీటిని రాళ్లు కంకర నింపిన గుంత ద్వారా భూమిలోకి పంపే చిన్నపాటి నిర్మాణం.
● బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్
ఎండిపోయే దశకు చేరిన బోరుబావుల చుట్టూ ప్రత్యేక ఫిల్టర్ బెడ్ నిర్మించి వర్షపునీటిని శుద్ధిచేసి నేరుగా బోరులోపలకి పంపిస్తారు. ఈ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 25వేలు ఖర్చు చేస్తుంది.
● ఫామ్ పాండ్స్
వ్యవసాయ పొలాల్లో నిర్మించే పెద్దనీటి కుంటలు. ఇవి వర్షపు నీటిని నిల్వ చేయడమే కాకుండా చేపల పెంపకానికి, పశువుల నీటి అవసరాలకు ఉపయోగ పడతాయి. దీని నిర్మాణ వ్యయం 4లక్షల రూపాయలు ఉంది.
● కామన్ సోక్ పిట్(ఉమ్మడి ఇంకుడుగుంత)
ఒకే ప్రాంతంలోని పలువురు రైతులు, పొరుగు కుటుంబాలు ఉమ్మడిగా వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసే ఇంకుడుగుంత. నిర్మాణ వ్యయం రూ. 7500.
● కమ్యూనిటీ సోక్ పిట్(సామూహిక ఇంకుడుగుంత)
వీధుల నుంచి వచ్చే వర్షపునీటిని ఒకచోటచేర్చి భూగర్భజలాలను పెంచే పెద్ద నిర్మాణం. దీని నిర్మాణ వ్యయం రూ 13వేలు.
● ఓపెన్ వెల్
పెద్దబావులకు వర్షపునీటిని మళ్లించి శుద్ధిచేసి అందించే భారీ నిర్మాణం. ఒక్కో యూనిట్ నిమిత్తం ప్రభుత్వం రూ. 3.50లక్షలు ఖర్చు చేస్తుంది.
ఫ ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వాన నీటి సంరక్షణే మార్గం
ఫ భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రణాళిక
ఫ నూరుశాతం సబ్సిడీతో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణం


