పెరుగుతున్న ఓపీ, ల్యాబ్ సేవలు
బీబీనగర్ ఎయిమ్స్‌పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదు. పనులు ఆలస్యమవుతున్న విషయాన్ని గుర్తించాం. ఈ సంవత్సరం చివరి నాటికి క్యాంపస్‌లో నిర్మాణాలు పూర్తవుతాయి. ఇక్కడ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం లభిస్తుంది. క్యాంపస్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతానని ఇటీవల ఎయిమ్స్ సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు.
సాక్షి, యాదాద్రి : బీబీనగర్‌లోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో అద్భుతమైన వైద్యసేవలు, పరిశోధనల్లో ఎన్నో మైలురాళ్లను చేరుకుంటున్నా భవన నిర్మాణ పనుల్లో జాప్యం.. మౌలిక వసతుల లేమి, సిబ్బంది కొరత కారణంగా రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడ ం లేదు. ముఖ్యంగా భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తేనే ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది.
నత్తనడకన భవన నిర్మాణాలు
రూ.1,000 కోట్లకుపైగా నిధులతో 201 ఎకరాల విస్తీర్ణంలో 750 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు 85 శాతం పూర్తయ్యాయి. సైట్‌లో కార్మికుల కొరత వల్ల పనుల పూర్తికి గడువులు మారుతూ వస్తున్నాయి. 2025 నాటికే పూర్తి కావాల్సిన ఈ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని ఇటీవల ఎయిమ్స్ సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఆడిటోరియం, రెసిడెన్షియల్ క్వార్టర్స్, కొత్త ఆస్పత్రి బ్లాక్ పనులు సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది.
వేధిస్తున్న ఫ్యాకల్టీ, డాక్టర్ల కొరత
ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 902 మంది వైద్య విద్యార్థులున్నారు. వీరికి విద్యాబోధన, రోగులకు చికిత్స అందించే నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. మంజూరైన 183 ఫ్యాకల్టీ పోస్టులకు 131 మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రొఫెసర్ పోస్టులలో ఏకంగా 65 శాతం ఖాళీలున్నాయి. 186 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 101 భర్తీ కాగా, 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కరే డాక్టర్ ఉండడంతో పనిభారం పెరుగుతోంది. అత్యవసర కేసులను సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఫైర్ స్టేషన్, ట్రామా కేర్ ఏవీ?
క్యాంపస్‌లో 18 నుంచి 23 అంతస్తుల భవనాలు ఉన్నాయి. 1,000 మందికి పైగా విద్యార్థులు నివసిస్తుండగా, ఈ సంఖ్య త్వరలో 1,500కి చేరనుంది. అయినా ఇక్కడ పూర్తిస్థాయి ఫైర్ స్టేషన్ అందుబాటులోకి రాలేదు. భవనం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొలిక్కి రాలేదు. అలాగే జాతీయ రహదారి పక్కనే ఉన్నా ఎమర్జెన్సీ వార్డులో కేవలం 13 బెడ్లు మాత్రమే ఉండడం ఆందోళనకరం. ట్రామా కేర్ సెంటర్, రోగుల సహాయకుల కోసం ‘విశ్రామ్ సదన్’ ఏర్పాటుతో పాటు గ్రీన్ క్యాంపస్‌గా (సోలార్ ప్యానెళ్లు, ఈవీ చార్జింగ్) మార్చాల్సిన అవసరం ఉంది.
పరిశోధనలకు పెద్దపీట
ఐదు సంవత్సరాలల్లో ఎయిమ్స్ పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి క్యాన్సర్, వైరల్ వ్యాధులు, క్షయ, పోషకాహారం తదితర అంశాలపై పరిశోధనలు కేంద్రీకరించింది. మొత్తం గా ఎయిమ్స్‌లో 1,156 ప్రచురణలు చేయగా, 64 కోట్ల రూపాయలు పరిశోధనలకే కేటాయించారు. ఇందులో 129 ప్రాజెక్టులకు నిధులు దక్కగా, 6 పేటెంట్లు, కాపీరైట్లను సంస్థ సాధించింది.
ఫ ఇప్పటికే రెండు సార్లు గడువు
పెంచిన కేంద్రం
ఫ వేధిస్తున్న ఫ్యాకల్టీ, డాక్టర్ల కొరత
ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితేనే కార్పొరేట్ స్థాయి వైద్యం
సమస్యలున్నప్పటికీ ఓపీడీ సేవలు మెరుగుపడ్డాయి. 2020–21లో 7,116గా ఉన్న ఓపీడీ రోగుల సంఖ్య, 2025–26 నాటికి 5,09,299కి చేరుకుంది. ఇప్పటివరకు 16,83,121 మందికి వైద్యసేవలు అందించగా, సగటున రోజుకు 1,800 మంది వస్తున్నారు. 2025–26లో ఇన్–పేషెంట్ల (ఐపీ) సంఖ్య 10,883కు చేరింది. ‘ఈ–సంజీవని’ ద్వారా ఇప్పటివరకు 1,53,408 టెలిమెడిసిన్ కన్సల్టేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2019–20లో 2,665 ఉండగా, 2025–26 నాటికి 10,44,167కు పెరిగింది. క్యాథ్ ల్యాబ్, లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ వంటి అత్యాధునిక పరికరాలను అమర్చుతున్నారు.


