ప్రతి మున్సిపాలిటీకి నోడల్ ఆఫీసర్ నియామకం
భువనగిరిటౌన్ : ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోతూ తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. భూగర్భ జలాలను పెంచేందుకుగాను ‘క్యాచ్ ది రెయిన్–2026’ జాతీయ ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రతి చుక్క వర్షపు నీటిని పొదుపు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని భారీ ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది.
ఆరు మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం
జిల్లాలోని భువనగిరి, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో భూగర్భ జలాలను పెంచే ప్రయత్నాలను మున్సిపల్ శాఖ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టరేట్‌తో పాటు ప్రధాన కూడళ్లలో హోర్డింగులు, అవగాహన బోర్డులను ఏర్పాటు చేశారు. భువనగిరి మున్సిపాలి టీలో ఖాళీ స్థలాలు, ఇళ్ల పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్, కమి షనర్ ఆధ్వర్యంలో ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ప్రజా భాగస్వామ్యంతో అవగాహన
భూగర్భ జలాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు (ఐకేపీ), విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. స్థానిక భాషల్లో బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ, వారి చేత మొక్కలు నాటించే కార్యక్రమాలను చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన
కార్యక్రమాల వివరాలు
● అన్ని ప్రభుత్వ భవనాల్లో రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ తప్పనిసరి.
● రీఛార్జ్ పిట్లు, రీఛార్జ్ బావులు, రీఛార్జ్ షాఫ్టులు, ఇంజెక్షన్ బావుల నిర్మాణానికి ఆదేశాలు.
● వినియోగంలో లేని బోరుబావులను పునరుద్ధరించడం.
● చెరువులు, సరస్సులు, సంప్రదాయ నీటి వనరుల పునరుజ్జీవనానికి ప్రత్యేక చర్యలు.
● పట్టణాల్లోని కాలువలు, జలాశయాల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టడం.
● వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు.
పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో ‘స్పాంజ్ పార్కులు’ అభివృద్ధి.
● రీఛార్జ్ జోన్లు, క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కల పెంపకం.
కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రతి మున్సిపాలిటీకి ఒక నోడల్ అధికారిని మున్సిపల్ శాఖ నియమించింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన ప్రతి పని వివరాలను, జియో–ట్యాగ్ చేసిన ఫొటోలను ప్రతిరోజూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ యూనివర్స్ ప్లాట్‌ఫామ్, జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్జేబీ) పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు వ్యక్తిగతంగా ఈ పనులను పర్యవేక్షించి, సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఫ ‘క్యాచ్ ది రెయిన్–2026’కు శ్రీకారం
ఫ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యాచరణ
ఫ ప్రజా ఉద్యమంగా మార్చాలని కేంద్రం పిలుపు


