మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెం, మేళ్లచెరువు మండల వేపలమాదారంలో పట్టుబడిన నకిలీ డీఏపీ ఎరువులకు సంబంధించిన మూలాలను హుజూర్‌నగర్, మఠంపల్లి పోలీసులు కనిపెట్టారు. హుజూర్‌నగర్‌సీఐ గజ్జె చరమందరాజు, మఠంపల్లి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో ఓ గోదాంలో నకిలీ ఎరువులు తయారు చేస్తున్నట్లు కనిపెట్టారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి గోదాంపై మెరుపు దాడి చేయగా.. నకిలీ ఎరువులు తయారుచేసే ముఠా తప్పించుకున్నారు. రూ.15లక్షలు విలువైన సుమారు 1000 నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మట్టి, ఉప్పు, రసాయనాలతో కూడిన నాసిరకం పదార్థాలతో డీఏపీ ఎరువులు తయారుచేసి ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో నింపి ఒక్కో బస్తా రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ ఎరువులను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి తదితర ప్రాంతాలకు ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని సీఐ చరమందరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నకిలీ ఎరువులను వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించామని.. ,పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు.
ఫ రూ.15లక్షల విలువైన
1000 బస్తాల నకిలీ ఎరువులు సీజ్


