ఫ గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి
భువనగిరిటౌన్ : రోజూ ఆడుతూ పాడుతూ తిరిగే బాలిక ఉదయాన్నే బ్యాగు వేసుకుని స్కూల్‌కు వెళ్లాల్సిన సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందింది. ఈ విషాద ఘటన భువనగిరి పట్టణంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన చిన్నగారి మల్లేష్, కళమ్మ దంపతుల కుమార్తె దీక్షిత(12) స్థానిక మదర్ థెరిస్సా పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. రోజుమాదిరిగా గురువారం ఉదయం నిద్ర లేచిన దీక్షిత ఇంట్లోని కుర్చీలో కూర్చుని ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఉదయాన్నే పుస్తకాల బ్యాగుతో బడికి పంపాల్సిన బిడ్డను కాటికి పంపాల్సి వచ్చిందే అంటూ దీక్షత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు ఆస్పత్రి ప్రాంగణంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. దీక్షిత మృతిచెందిన విషయం తెలుసుకున్న మదర్ థెరిస్సా స్కూల్ యాజమాన్యం పాఠశాలకు సెలవు ప్రకటించింది. దీక్షిత భౌతికకాయాన్ని చూసి సహచర విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు.


