లోపాలు లేకుండా చేయడమే లక్ష్యం
నకిరేకల్ : విద్యార్థులు అభ్యసనంలో వెనుకబడకుండా, ప్రతి చిన్నారి కనీస భాషా, గణిత నైపుణ్యాలు సాధించేలా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన్– ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) శ్రీరెమిడియేషన్‌శ్రీ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయనుంది. సాధారణ బోధనతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సమయం కేటాయించి, లక్ష్యాధారిత బోధన ద్వారా వారి అభ్యసన లోపాలను అధిగమించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనిని విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యాశాఖ దశలవారీగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
దశలవారీగా శిక్షణ
రెమిడియేషన్ కార్యక్రమం అమలులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 175 మంది జిల్లా రీసోర్స్‌పర్సన్లకు ఈ నెల 6, 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల టీజీఐఈఆర్‌డీలో శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందిన వీరు ఈ నెల 13, 14, 15 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి జిల్లా కేంద్రాల్లో 292 మంది మండల రీసోర్స్‌పర్సన్లకు శిక్షణ అందించారు. వీరు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రెండు విడతల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 20,500 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరందరికీ దశలవారీగా ఈ శిక్షణ అందనుంది.
రెమిడియేషన్ అంటే..?
విద్యార్థులు ఏయే అంశాల్లో వెనుకబడ్డారో గుర్తించి, ఆ లోపాలను ప్రత్యేక బోధన, సాధన, నిరంతర పర్యవేక్షణ ద్వారా సరిదిద్దే ప్రక్రియనే ‘రెమిడియేషన్’ అంటారు. చదువులో వెనుకబడిన వారిని ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి తీసుకురావడమే దీని ఉద్దేశం. విద్యార్థుల్లో హాజరు శాతం తక్కువగా ఉండటం, భాషాపరమైన ఇబ్బందులు, ఇంటి వద్ద తగిన విద్యా సహకారం లేకపోవడం, గతంలో బోధించిన అంశాలపై అవగాహన లోపించడం వంటి కారణాలతో కొందరు పిల్లలు వెనుకబడే అవకాశం ఉంటుంది. ఈ లోపాలను ప్రారంభ దశలోనే సరిదిద్దేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది.
ప్రత్యేక సమయం కేటాయింపు
విద్యార్థులందరి నేర్చుకునే వేగం ఒకేలా ఉండదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమం కింద వారికి వ్యక్తిగత మద్దతు అందిస్తారు. ప్రధాన సబ్జెక్టులైన తెలుగు లేదా ఉర్దూ, ఇంగ్లిష్, గణితంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక సమయం కేటాయిస్తారు. సోమ, మంగళవారాల్లో తెలుగు.. బుధ, గురువారాల్లో గణితం.. శుక్ర, శనివారాల్లో ఇంగ్లిష్ బోధన చేయనున్నారు. అందరు పిల్లలు ఒకే వేగంతో నేర్చుకునేలా ఒత్తిడి చేయకుండా, ప్రతి విద్యార్థి తన సామర్థ్యానికి అనుగుణంగా ప్రగతి సాధించేలా ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి విద్యా క్యాలెండర్‌ను రూపొందించింది.
ఫ పటిష్టంగా అమలు చేయనున్న
పాఠశాల విద్యాశాఖ
ఫ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు
ఫ ఈ నెల 20 నుంచి 25 వరకు
మండల స్థాయిలో నిర్వహణ
విద్యార్థుల్లో అభ్యసన లోపాలను ప్రారంభంలోనే సరిదిద్దకపోతే తర్వాత బోధించే కొత్త భావనలను నేర్చుకోవడం వారికి కష్టమవుతుంది. కాలక్రమంలో ఈ లోపాలు పెరిగి వారి మొత్తం అభ్యసనంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రతి విద్యార్థి నేర్చుకోవడానికి, ప్రగతి సాధించడానికి తగిన ప్రోత్సాహం పొందాలి. రెమిడియేషన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అర్థవంతమైన అభ్యసనంలో చురుకుగా పాల్గొనేలా చూడవచ్చు.
– తాటిపాముల నర్సింహమూర్తి,
నల్లగొండ జిల్లా రీసోర్స్‌పర్సన్


