మాడుగులపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామానికి చెందిన చామర్తి ఉపేంద్రచారి(32) మాడుగులపల్లి మండలం కొత్తగూడెం గ్రామంలోని శ్రీబాలాజీ వేర్‌హౌసింగ్ అండ్ లాజిస్టిక్ గోదాంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. కుక్కడం గ్రామ శివారులో ముందు వెళ్తున్న బైక్‌ను క్రాస్ చేయబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మెలకు ఢీకొని తీవ్రంగా గాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిల్పకుంట్లకు చెందిన మరో వ్యక్తి..
నూతనకల్ : మండలంలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన వేల్పుల గంగయ్య(48) జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. వారం క్రితం హైదరాబాద్‌లోని అంబర్‌పేట సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.


