నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమవుతున్నారు. దేవాలయంలో రుద్రాభిషేకం పూజకు రూ.1,116 టికెట్ పెట్టారు. ఇతర దేవాలయాల్లో ఎక్కడా ఇంత ధర లేదు. కానీ ఈ టికెట్ తీసుకున్న భక్తులకు దేవస్థానం తరఫున ఎలాంటి సన్మానం, ప్రసాదం అందించడం లేదు. గుట్ట పైన కోనేరులో నీరు కలుషితంగా ఉండటంతో స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
అధిక రేట్లకు విక్రయం..
గట్టు పైన కిరాణా షాపులు, కూల్‌డ్రింక్ షాపులను టెండర్ ద్వారా దక్కించుకున్న వారు అధిక రేట్లకు విక్రయిస్తున్నా సంబంధిత అధ/కారులు, పాలకమండలి సభ్యులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ సిబ్బంది ప్రోత్సాహంతోనే వ్యాపారస్తులు అధిక రేట్లకు పూజా సామగ్రి, వాటర్ బాటిళ్లు విక్రహిస్తున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు గుండ్ల పైన శివలింగానికి అభిషేకం చేసేందుకు గాను భక్తులకు రూ.100కు స్టీల్ బాక్స్‌లో పాలు విక్రయిస్తున్నారు. ఇవి కనీసం పావు లీటరు కూడా ఉండటం లేదని, అంతేకాకుండా నాణ్యత లేని కూల్ వాటర్, కూల్‌డ్రింక్స్ విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లు ఎక్కువ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల అమావ్యాస రోజు వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారస్తులు అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, దేవాలయ అధికారులు ధరల పట్టిక ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
పాలకమండలి దృష్టి సారించాలి
చెర్వుగట్టు ఆలయ పాలకమండలి ఏర్పాటై రెండు నెలలవుతున్నా భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై, ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా లక్ష పుష్పార్చన పూజ చేసేందుకు భక్తులకు అవకాశం కల్పించడం లేదు. పాలకమండలి చైర్మన్, సభ్యులకు, దేవాలయ కార్యనిర్వహణ అధికారుల మద్య విభేదాలు కొనసాగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఫ చెర్వుగట్టుపై భక్తులకు ఇబ్బందులు
ఫ అధిక ధరకు పాలు, వాటర్
బాటిళ్లు విక్రయిస్తున్న వ్యాపారులు
ఫ పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
ఫ కలుషితంగా కోనేటి నీరు


