ఒలింపిక్స్‌లో ఆడాలన్నదే నా లక్ష్యం
డిండి : నిరుపేద కుటంబంలో జన్మించిన ఆ యువతి తన ప్రతిభతో దేశానికే గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రిలే పరుగు పందెంలో భారత జట్టు తరఫున పాల్గొని బంగారు పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. డిండి మండల కేంద్రానికి చెందిన నారిమళ్ల రాంబాబు, విజయ దంపతులు మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ప్రవళిక ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు డిండి మండల కేంద్రంలోనే ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంది. ఫీజు కట్టేంత ఆర్థిక స్థోమత లేక గురుకుల ప్రవేశ పరీక్ష రాయగా.. స్థానిక గురుకుల పాఠశాలలో ప్రవళికకు సీటు వచ్చింది. దీంతో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలో చదివింది. ప్రస్తుతం నల్లగొండలోని గురుకుల డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. గురుకుల పాఠశాలలో చేరగానే ప్రవళిక క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. పాఠశాలలో నిర్వహించే క్రీడా పోటీల్లో ఎక్కువగా పరుగు పందెంలో పాల్గొని అసాధారణ ప్రతిభ కనబర్చింది. ప్రవళిక టాలెంట్‌ను గుర్తించిన పీఈటీ జ్యోతి ఆమెను ప్రోత్సహిస్తూ పరుగు పందెంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
అథ్లెటిక్స్‌లో చేరిక..
2020లో ప్రవేశ పరీక్ష ద్వారా డిండి గురుకుల అథ్లెటిక్స్ అకాడమీలో చేరిన ప్రవళిక కోచ్ పరుశురాం శిక్షణలో మెళకువలు నేర్చుకుంది. అప్పటి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో 35, జాతీయ స్థాయిలో 3 పతకాలతో పాటు ఇటీవల చైనాలో ఇటీవల జరిగిన అండర్–23 అథ్లెటిక్స్ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 4 400 మీటర్ల రిలే పరుగు పందెంలో భారతదేశం తరఫున పాల్గొని బంగారు పతకం సాధించింది.
ఫ పరుగు పందెంలో రాణిస్తున్న
గురుకుల విద్యార్థిని
ఫ అథ్లెటిక్స్ అంతర్జాతీయ
ఛాంపియన్‌షిప్‌లో
బంగారు పతకం కైవసం
నా తల్లిదండ్రులు ప్రోత్సాహంతో పాటు పీఈటీ మేడం జ్యోతి ఇచ్చిన శిక్షణతో డిండి గురుకుల అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశం దొరికింది. అప్పటి నుంచి కోచ్ పరుశురాం నేర్పిన మెళకువలతో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరుగు పందెంలో పతకాలు సాధించాను. స్థానిక గురుకుల పాఠశాల అధ్లెటిక్స్ అకాడమీలో పీజీ విద్యార్థులు కూడా శిక్షణ పొందే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. భవిష్యత్తులో దేశం తరఫున ఒలంపిక్స్‌లో పాల్గొని పతకం సాదించాలన్నదే నా లక్ష్యం.
– నారిమళ్ల ప్రవళిక


