నల్లగొండ : రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను నల్లగొండ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సీఐ రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ అలియాస్ సత్తిబాబుపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 47 చోరీ కేసులు ఉన్నాయి. రాత్రివేళ ఇళ్లు, వ్యాపార సంస్థలు, షాపులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో పలుమార్లు అరైస్టె జైలుకెళ్లి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో నివాసముంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నప్పటికీ తన నేర ప్రవర్తనను విడిచిపెట్టకుండా చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 3వ తేదీన రాత్రి నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గల హనుమాన్ స్పోర్ట్స్ షాపు షట్టర్ తాళాన్ని ఇనుప రాడ్డుతో పగులగొట్టి కౌంటర్‌లో దాచిన రూ.3,40,000 నగదు ఎత్తుకెళ్లాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం నార్కట్‌పల్లి బస్టాండ్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడి నుంచి రూ.52,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
ఫ రూ.52 వేల నగదు స్వాధీనం


