చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో చేపట్టిన అక్రమ నిర్మాణాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నాడని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. వలిగొండ రోడ్డులోని ప్రధానా నాలా, నాలాలో కౌన్సిలర్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. అదే విధంగా చౌటుప్పల్–వలిగొండ ప్రధాన రహదారి పనుల ఆలస్యంపై పార్టీ శ్రేణులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సేవ చేస్తాడని ప్రజలు కౌన్సిలర్‌గా గెలిపిస్తే నాలాలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నాడని ధ్వజమెత్తారు. 200గజాలకు అనుమతులు తీసుకొని 500గజాలలో నిర్మాణం చేస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పాత్ర ఎంత, షాడో ఎమ్మెల్యే పాత్ర ఎంత, మున్సిపల్ చైర్మన్ పాత్ర ఎంత ఉందని ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస.. సమస్యల పరిష్కారంపై ఏమాత్రం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ మండల, మున్సిపల్ అధ్యక్షులు గిర్కటి నిరంజన్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్, ఊదరి యాదయ్య, నాయకులు డిల్లీ మాధవరెడ్డి, దేవరపల్లి గోవర్దన్‌రెడ్డి, తాడూరి పరమేష్, ఊడుగు మల్లేష్, సుర్వి మల్లేష్, కొత్త పర్వతాలు, ముప్పిడి శ్రీనివాస్, కై రంకొండ వెంకటనర్సయ్య, డిల్లీ శంకర్‌రెడ్డి, బోరెం ప్రశాష్‌రెడ్డి, బాతరాజు యాదయ్య, ఎం.డి.ముషీర్, చెవగోని మహేష్, చింతల మహిపాల్‌రెడ్డి, సుర్కంటి శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ మాజీ మ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరోపణ
ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించం
వరద కాలువ పేరుతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, బోయ దేవేందర్‌లు పేర్కొన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. బాధ్యత కలిగిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అంతేగానీ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాలా నిర్మాణం ఎందుకు చేయించలేదో చెప్పాలన్నారు. రాజగోపాల్‌రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు.


