భువనగిరి : జిల్లాలో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. తీవ్రమైన ఎండవేడిమి, ఉక్కపోత, చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జూలై రెండో వారం దాటినప్పటికీ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం గమనార్హం. జిల్లాలోనే అత్యధికంగా రామన్నపేట మండలం వెల్లంకిలో 38.5 డిగ్రీలు, భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్, చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేటలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భువనగిరి మండలం బోల్లేపల్లి, బీబీనగర్ మండలం వెంకిర్యాలలో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వలిగొండ, రామన్నపేట, కొలనుపాక, బొల్లేపల్లి ప్రాంతాలలో రాత్రి వేళల్లో సైతం అత్యధికంగా 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నులిపురుగుల నివారణకు కృషి చేయాలి
భువనగిరి : నులిపురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా భువనగిరి మండలంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,51,040 మంది పిల్లలకు మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో మొదటి రోజు 96 శాతం పిల్లలకు మాత్రలు వేశామన్నారు. మొదటి రోజు మాత్రలు వేసుకోని వారికి ఈ నెల 20వ తేదీన పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, డీఐఓ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సుమన్ కళ్యాణ్, అరుణకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.అండాలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసుల పరిష్కారానికి సహకరించాలి
భువనగిరిటౌన్ : చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌కు జిల్లాలోని బ్యాంకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు కోరారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యాలయంలో సంస్థ కార్యదర్శి వి.మాధవీలతతో కలిసి జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంలో బ్యాంకులు తమ పరిధులకు లోబడి ఖాతాదారులకు రాయితీలు, మినహాయింపులు ఇస్తే ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
31న జన జాగరణ యాత్ర
భువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం (టీఎస్ సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో ఈ నెల 31న జిల్లాలో నిర్వహించనున్న జన జాగరణ యాత్రకు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆయా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు చామల తిరుపతిరెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్, టీఎస్ సీపీఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి విష్ణు భాశెట్టి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిల్ల రవీందర్, టీఎన్జీఓ జిల్లా ట్రెజరర్ కే.శ్రీకాంత్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కుంట్ల అమరేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


